source: X
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి షఫాలీ తన సెంచరీ పూర్తి చేసుకుంది.
భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన


