source: BCCI X
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్‌లో భారత్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, రెండో ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.
ఇవాళ ఉదయమే జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి శ్రీలంక తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 22న స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొంటుంది. అదే రోజు కాంస్య పతకం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడతాయి. ఫైనల్లో ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది.
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పేసర్ నందిన శర్మ (4-0-25-3) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా పతనాన్ని శాశించింది. ఆమెకు స్పిన్నర్లు శ్రీచరణి (3-1-7-2), శ్రేయాంక పాటిల్ (3-0-22-1), దీప్తి శర్మ (2.4-0-7-3) సహకరించారు.
మరో పేసర్ క్రాంతి గౌడ్ (3-0-20-1) కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మొత్తంగా వీరి ధాటికి బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో దిల్హర అక్తర్ (27), షర్మిన్ అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన


