బుల్లెట్‌ దించారు | India wins two medals on opening day of Asian Games 2026 | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ దించారు

Sep 21 2026 6:02 AM | Updated on Sep 21 2026 6:02 AM

India wins two medals on opening day of Asian Games 2026

రెండు రజతాలు గెలిచిన భారత మహిళా షూటర్లు

ఇలవేనిల్‌ ‘డబుల్‌’ ధమాకా 

టీమ్‌ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో పతకాలు సొంత

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో పతకం ఖాయం చేసుకున్న సుచిక  

మరోసారి ‘శతక’ పతకాల మైలురాయిని అందుకోవాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజే భారత్‌ ఖాతాలో రెండు రజత పతకాలు చేరాయి. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. షూటింగ్‌లో భారత మహిళా షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ రెండు రజత పతకాలతో మెరిసింది. ముందుగా సోనమ్, విదర్శలతో కలిసి ఇలవేనిల్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించింది. 

ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్‌ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో మహిళా ఫైటర్‌ సుచిక తరియాల్‌ 60 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించి స్వర్ణం లేదా రజత పతకాన్ని అందుకోనుంది. హాకీలో భారత జట్లు ఘనవిజయాలతో బోణీ కొట్టగా... టేబుల్‌ టెన్నిస్‌లో మనోళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.  

నగోయా: పసిడి ఖాతా తెరువకపోయినా... ఆసియా క్రీడల తొలి రోజే భారత్‌ రెండు రజత పతకాలు సాధించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత షూటర్లు ఈ రెండు పతకాలను అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో ఇలవేనిల్‌ వలారివన్, సోనమ్‌ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన భారత జట్టు 1898 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. 

1904.2 పాయింట్లతో చైనా జట్టుకు స్వర్ణం దక్కగా... 1897.1 పాయింట్లతో జపాన్‌కు కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు సోనమ్‌ మస్కర్‌ 634.1 పాయింట్లతో మూడో స్థానంలో, ఇలవేనిల్‌ వలారివన్‌ 633.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన మరో షూటర్‌ విదర్శ వినోద్‌ 640.4 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో టాప్‌–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. 

క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల ఆధారంగా టీమ్‌ ఈవెంట్‌ పతకాలను ఖరారు చేశారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత ఫైనల్లో ఇలవేనిల్‌ 252.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకుంది. హినాటా తైచీ (జపాన్‌; 253 పాయింట్లు) బంగారు పతకం నెగ్గగా... హైజిన్‌ బాన్‌ (దక్షిణ కొరియా; 230.4 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది.

 భారత షూటర్‌ సోనమ్‌ 167 పాయింట్లతో ఆరో స్థానంతో సంతృప్తి పడింది. మరోవైపు మహిళల మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ 60 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో భారత ఫైటర్‌ సుచిక తరియాల్‌ 2–0తో బైగల్మా అల్తాన్‌చిమెగ్‌ (మంగోలియా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకాలు ఖాయమవుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement