నెతన్యాహు పర్యటనపై టెన్షన్‌.. రహస్య మంతనాలు? | Israel PM Netanyahu meets UAE president in Abu Dhabi | Sakshi
Sakshi News home page

నెతన్యాహు పర్యటనపై టెన్షన్‌.. రహస్య మంతనాలు?

Sep 28 2026 7:29 AM | Updated on Sep 28 2026 7:29 AM

Israel PM Netanyahu meets UAE president in Abu Dhabi

మధ్యప్రాచ్యంలో మళ్లీ కీలక పరిణామం.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హఠాత్తుగా అబుదాబి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో నెతన్యాహు భేటీ అయినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అయితే ఈ కీలక సమావేశంపై అటు నెతన్యాహు కార్యాలయం, ఇటు యూఏఈ విదేశాంగ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ఈ భేటీ జరుగుతున్న సమయంలోనే 2023 అక్టోబర్‌ 7 హమాస్‌ దాడికి సంబంధించి యూఏఈ.. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. హమాస్‌ ఇజ్రాయెల్‌పై భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని దాడికి సుమారు 10 రోజుల ముందు షేక్‌ మహమ్మద్‌.. నెతన్యాహును హెచ్చరించినట్లు హారెట్జ్‌ కథనం పేర్కొంది. అయితే ఆ సమాచారం ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు, సైన్యానికి చేరలేదని అందులో వెల్లడించింది. ఈ కథనాన్ని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హారెట్జ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

మరోవైపు 2023 హమాస్‌ దాడికి ముందు జరిగిన భద్రతా వైఫల్యాలపై నెతన్యాహుపై దేశీయంగా రాజకీయ ఒత్తిడి కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలు కూడా ఆయన బాధ్యతను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అబుదాబిలో నెతన్యాహు–షేక్‌ మహమ్మద్‌ భేటీ జరగడం ఆసక్తిని రేపుతోంది. కాగా.. ఇజ్రాయెల్‌, యూఏఈలు 2020లో అబ్రహం ఒప్పందాల ద్వారా దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష సమాచార మార్గాలు కొనసాగుతున్నాయని యూఏఈ చెబుతోంది.

ఇదిలా ఉంటే.. నెతన్యాహు, షేక్‌ మహమ్మద్‌ గతంలోనూ రహస్యంగా సమావేశమైనట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మేలో నెతన్యాహు.. యూఏఈని సందర్శించి రహస్యంగా అధ్యక్షుడిని కలిశారని సమాచారం. అబుదాబి సమీపంలోని అల్‌ ఐన్‌లో ఇరువురు నేతలు సమావేశమైనట్లు తెలిసింది. అయితే, ఇరాన్‌ యుద్ధం, గాజా సంక్షోభం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తాజా భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, నెతన్యాహు–షేక్‌ మహమ్మద్‌ తాజా చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

ఇదీ చదవండి: ఇరాన్‌లో కలకలం.. ఖమేనీకి ఏమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement