‘ఆ బీపర్లు గుర్తున్నాయిగా?’.. ఐరాస వేదికగా నెతన్యాహు సంచలన హెచ్చరిక! | Delegates walk out as Netanyahu addresses UN | Sakshi
Sakshi News home page

‘ఆ బీపర్లు గుర్తున్నాయిగా?’.. ఐరాస వేదికగా నెతన్యాహు సంచలన హెచ్చరిక!

Sep 25 2026 7:58 AM | Updated on Sep 25 2026 8:50 AM

Delegates walk out as Netanyahu addresses UN

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి (యూఎన్) సాధారణ సభలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన చేతిలో ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచాయి. గతంలో లెబనాన్‌లో హెజ్‌బొల్లా దళాలపై తాము నిర్వహించిన సంచలన పేజర్ ఆపరేషన్‌ను గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే వేదికపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేయగా, అంతర్జాతీయ మీడియా ఈ దృశ్యాలను ప్రముఖంగా హైలైట్ చేసింది. సభలో ఒకవైపు ప్రతినిధులు బయటకు వెళుతుండగా.. మరికొందరు చప్పట్లు కొడుతూ హీబ్రూ భాషలో ‘అమ్‌ ఇజ్రాయేల్‌ చాయ్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన నెతన్యాహు.. సభ నుంచి వెళ్తున్న వారిని ఉద్దేశించి ఇంకా నైతికంగా పిరికివాళ్లు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు!" అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తన ప్రసంగం ఆద్యంతం ఇరాన్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెతన్యాహు విమర్శలు గుప్పించారు. సభ నుంచి వెళ్లిన ప్రతినిధులు ఇరాన్‌పై దాడి చేయడాన్ని సమర్ధిస్తూనే ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు కూడా చెప్పారని, ఇంతకంటే దిగ్భ్రాంతికరమైన ద్వంద్వ ప్రమాణాలు మరొకటి ఉండవని మండిపడ్డారు. ఇరాన్ అణు కర్మాగారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులను సమర్థిస్తూ.. ఆ నిర్ణయం కష్టమైనప్పటికీ, ఒకవేళ తాము అలా చేయకపోయి ఉండేవాళ్లం కాదని, అందరం చనిపోయి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. (ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాగా, జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలోనూ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు జరిపింది).

ఇక వాకౌట్ జరుగుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తమ ఖాళీ కుర్చీలలో ఒక నిరసన సందేశాన్ని ఉంచారు. ప్రసంగం సాగుతున్నంత సేపు సభకు దూరంగా ఉన్న వారు.. ఇరాన్ ప్రముఖ నేత, ఖుద్స్ దళాల మాజీ కమాండర్ ఖాస్సెమ్ సులేమానీ చిత్రాన్ని అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. (2020 జనవరిలో అమెరికా డ్రోన్ దాడిలో సులేమానీ మరణించిన విషయం తెలిసిందే). 

ఈ సందర్భంగా యూఎన్ సభలో ప్రసంగిస్తూ తన చేతిలోని పేజర్‌ను పైకెత్తిన నెతన్యాహు.. ‘మేం హెజ్‌బొల్లాను తీవ్రంగా దెబ్బతీశాం. ఆ బీపర్ల (పేజర్లు) విషయం మీకు గుర్తుంది కదా? ఆ పరికరాల గురించి గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారు. హెజ్‌బొల్లా నాయకులు మరణించారని, ఇజ్రాయెల్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్న 1,50,000 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల భారీ ఆయుధ సంపత్తి అంతా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన సభలో స్పష్టం చేశారు.

మరోవైపు, ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలపై మండిపడిన నెతన్యాహు.. ఆ రెండు దేశాలు తమపై వలసవాద ఆరోపణలు చేస్తున్నాయని, దేవుడి దయవల్ల ఆ పదాన్ని కనిపెట్టింది వాళ్లే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement