ఐరాసకు ఏఐ కంపెనీల వినతి
లేదంటే మానవాళికి ముప్పు తప్పదు
జీవాయుధ తయారీ జరక్కుండా చూడాలి: డారియో
ఏఐ ఒక దేశానికి, కంపెనీకి పరిమితం కారాదు: సామ్ ఆల్ట్‌మ్యాన్
నియంత్రణ ఎప్పుడు? ఎలా? ఎవరు? అన్నది కీలకం: హగ్గింగ్ ఫేస్ సీఈవో
యునైటెడ్ నేషన్స్: చేతులు దాటిపోతున్న ఏఐ భూతానికి పగ్గాలేయకుంటే మానవాళికే ముప్పని, ప్రపంచదేశాలు ఎలాగైనా దానికి పగ్గాలేయాల్సిందేనని అంతర్జాతీయ ఏఐ కంపెనీలు బుధవారం ఐక్యరాజ్య సమితిని కోరాయి.
ప్రపంచం లేదంటే కనీసం ప్రజలను కాపాడేందుకైనా అంతకంతకూ విస్తరిస్తున్న కృత్రిమమేధను నియంత్రించాలని, లేదంటే ఈ టెక్నాలజీతో మానవాళి మొత్తానికే ముప్పు ఏర్పడవచ్చునని ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియో అమొడె వ్యాఖ్యానించగా ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ కూడా.. ఏఐని కట్టడి చేయకుంటే మనిషికి భవిష్యత్తు లేకుండా పోతుందని స్పష్టంగా హెచ్చరించారు.
నియంత్రించేందుకు వీలుకానంత శక్తిమంతంగా తయారు కాకముందే ప్రపంచ దేశాలు ఐరాస భద్రతామండలి ద్వారా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా డారియో, సామ్‌లతోపాటు హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్‌లు రిమోట్ పద్ధతిలో ఏఐ టెక్నాలజీ ముప్పుపై వివరించారు.
ఏఐ అనేది ఏదో ఒక దేశం లేదా కంపెనీ వద్దే కేంద్రీకృతం కాకుండా చూసుకోవాలని తమ వాంగ్మూలంలో తెలిపిన సీఈవోలు ఈ టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే ప్రజలకు అద్భుత ప్రయోజనాలూ కలుగుతాయని తెలిపారు. ఏఐ ద్వారా జీవశాస్త్ర ఆయుధాలను నిర్మించకూడదన్న అంశాన్ని ప్రపంచ నేతలందరూ అంగీకరించాలని, ఏ కృత్రిమ మేధ మోడల్ శక్తి ఏమిటి? అన్నది ధ్రువీకరించేందుకు నిర్దిష్ట పద్ధతులను అభివృద్ధి చేయాలని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమొడె పిలుపునిచ్చారు.
మోడళ్లపై చేసే పరీక్షలతోపాటు ఏఐ మోడళ్ల దురి్వనియోగమైనప్పుడు, నియంత్రణ కోల్పోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని ప్రమాణాలను సిద్ధం చేయాలని సూచించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ మాట్లాడుతూ ఎఐని ఎవరు, ఎలా? నియంత్రించాలి? అన్నదానిపై దృష్టిపెట్టాలని, ఇందుకు తగిన సమయం ఏదన్నది కూడా నిర్ణయించుకోవాలని చెప్పారు.
ఆగిపోవాల్సిన అవసరం లేదు: అమెరికా
ఏఐ నియంత్రణ విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నంత మాత్రాన టెక్నాలజీ అభివృద్ధి మొత్తాన్ని నిలిపేయాల్సిన అవసరం లేదని, అంతర్జాతీయ స్థాయి పర్యవేక్షణ పేరుతో పరిమితులు విధించడమూ సరికాదని వైట్‌హౌస్ శాస్త్ర సలహాదారు మైకేల్ క్రాట్స్‌సోసిస్ అభిప్రాయపడ్డారు. ‘‘మీరు, మా భాగస్వాములు కూడా ఈ టెక్నాలజీ లాభాలను పంచుకోవాలని భావిస్తున్నాం’’అని వ్యాఖ్యానించారు.
ఏఐ రంగంలో పై చేయి సాధించేందుకు అమెరికా, చైనాలు కొంతకాలంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరాసలో చైనా దౌత్యవేత్త ఏఐ టెక్నాలజీ నియంత్రణ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టెక్నాలజీ రంగంలో.. ‘‘మేము.. వాళ్లు ’’అన్న చౌకబారు చర్యలకు దిగకూడదని, ఆయా దేశాలు తమకు తగ్గ విధంగా ఏఐని వాడుకునే అవకాశం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా డిజిటల్ రంగంలో ఏ దేశపు పెత్తనమూ అవసరం లేదని పరోక్షంగా తెలిపారు.
చైనా తరహాలో ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేలా (ఓపెన్ సోర్స్ మోడల్) చూడాలని పిలుపునిచ్చారు. ఏఐ రంగంలో ముందు వరుసలో ఉన్న దేశాల వైఖరులు ఇలా ఉంటే.. ఫ్రాన్స్, ఉక్రెయిన్‌లు కూడా ఈ టెక్నాలజీపై తమదైన శైలిలో స్పందించాయి.
ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జీన్ నోయెల్ బారెట్ మాట్లాడుతూ అణుశక్తి విషయంలో మాదిరిగానే అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఏఐని నియంత్రించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ యంత్రాలపై ఏదో ఒకరకమైన నియంత్రణ తప్పక ఉండాలని స్పష్టం చేశారు. లేదంటే నాలుగున్నరేళ్లుగా యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్ ఉనికిలోనే లేకుండా పోవచ్చునన్నారు.
జీ20 సమావేశాల్లో చర్చిస్తాం: యూకే
డారియో, సామ్‌లు వాస్తవం చెబుతున్నారని, ప్రపంచంపై పడే విపత్తును నివారించే బాధ్యతను ఆ కంపెనీలకే వదిలేయకుడదని స్పష్టం చేస్తున్నారని బ్రిటిష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎడ్ మిల్లిబాండ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తాము నేతృత్వం వహిస్తున్న జీ20 సమావేశాల్లోనూ ఏఐ టెక్నాలజీ నియంత్రణే లక్ష్యంగా చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి సురక్షితంగా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రమాణాలను రూపొందిస్తామని తెలిపారు. అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఇందుకు సమ్మతించకపోగా.. ‘‘అలాంటి పనులు చేయవద్దు’’అని చెబుతోంది.


