క్యాబ్‌ తలుపు తెరిచేలోపే తెలిసిన నిజం.. భారతీయుడి అనుభవం వైరల్ | Indian Man Shares Experience With Deaf Cab Driver In US | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ తలుపు తెరిచేలోపే తెలిసిన నిజం.. భారతీయుడి అనుభవం వైరల్

Sep 25 2026 3:46 AM | Updated on Sep 25 2026 3:46 AM

 Indian Man Shares Experience With Deaf Cab Driver In US

అమెరికాలో క్యాబ్‌ ప్రయాణం వేళ బధిర డ్రైవర్‌ను కలిసిన భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ ఖేతర్‌పాల్ తన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఆయన చేసిన పోస్టు సమాన అవకాశాలపై చర్చకు దారితీసింది.

అమెరికాకు వెళ్లిన తర్వాత హోటల్‌కు చేరుకునేందుకు గౌరవ్ ఖేతర్‌పాల్ లిఫ్ట్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్‌ వచ్చే ముందు ఆయనకు కేటాయించిన డ్రైవర్ బధిర వినికిడి లోపం ఉన్న వ్యక్తి అని యాప్‌లో సమాచారం కనిపించింది. ప్రయాణికుడితో సంభాషణ సులభంగా సాగేందుకు యాప్‌ తెరపై అమెరికన్ సంకేత భాషలోని ప్రాథమిక పదబంధాలను కూడా చూపించింది. ఇందులో ధన్యవాదాలు, హలో వంటి పదాలు ఉన్నాయి.

క్యాబ్‌ అక్కడికి చేరుకున్న తర్వాత డ్రైవర్ తన పరిస్థితిని వివరిస్తూ ఓ చిన్న స్వాగత కార్డును గౌరవ్‌కు అందించారు. దీనిపై స్పందిస్తూ గౌరవ్.. “ఆయన తన పరిస్థితిని వివరిస్తూ, నన్ను స్వాగతిస్తూ ఓ కార్డు ఇచ్చారు. నేను సంకేత భాషలో ధన్యవాదాలు చెప్పాను” అని రాశారు.

ఈ అనుభవాన్ని భారత్‌తో పోల్చిన గౌరవ్.. “వికలాంగుల విషయంలో భారత్‌లోనూ ఇలాంటి స్థాయి అవకాశాలు, గౌరవం ఎప్పుడు లభిస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కోటా ఇవ్వడాన్ని దాటి ముందుకు వెళ్లగలమా?” అని ప్రశ్నించారు. అమెరికాలో కూడా అనేక సమస్యలు ఉండొచ్చని, అయితే వికలాంగతతో సంబంధం లేకుండా సమాన అవకాశాల కల్పనపై అక్కడి విధానం తనను ఆకట్టుకుందని పేర్కొంటూ.. “భారత్.. మనమంతా మరింత ముందడుగు వేయాలి” అన్నారు.

ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు సంస్థలు వికలాంగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను ప్రస్తావించగా, మరికొందరు బెంగళూరులో క్యాబ్‌ బుకింగ్‌ సమయంలో డ్రైవర్ వివరాలు కనిపిస్తాయని తెలిపారు. కొందరు విమానాశ్రయాల్లో బధిర సిబ్బంది సంకేత భాషను ఉపయోగిస్తున్న విషయాన్ని పంచుకున్నారు. మరికొందరు అత్యవసర పరిస్థితుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement