వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అమెరికా తమపై మళ్లీ దాడులకు దిగితే, ఈ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు.
ఇరాన్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు బదులుగా.. ఇరాన్ తన సైనిక వ్యూహాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రంలోని హర్మూజ్ జలసంధి వరకే పరిమితమైన దాడులు.. భవిష్యత్తులో అమెరికా స్థావరాలు, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని హిందూ మహాసముద్రం నుంచి తిప్పికొడతామని సఫావీ పేర్కొన్నట్లు ఇరాన్‌కు చెందిన ఫార్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. అమెరికా కవ్వింపు చర్యలు, ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధాన్ని తిప్పికొట్టేందుకే ఈ వ్యూహాత్మక మార్పు చేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
భారత సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు
సఫావీ హెచ్చరికలతో గల్ఫ్ ఆఫ్ ఓమన్, పర్షియన్ గల్ఫ్‌తో పాటు భారత సముద్ర భూభాగమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐరోపాను ఆసియాతో కలిపే బాబ్ అల్-మండెబ్ జలసంధి, ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ తదితర సముద్ర రవాణా మార్గాల్లో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
భారత్‌పై ప్రభావం - దౌత్య యత్నాలు
ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే భారత్ యొక్క ముడిచమురు దిగుమతులు, సముద్ర వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ జలాల్లో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. మరోవైపు, ఇరాన్ బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య తెరవెనుక చర్చలు కూడా కొనసాగుతుండటం గమనార్హం.


