న్యూఢిల్లీ: అనర్హత వేటు పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జయమల్య బాగ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీకు (దానం నాగేందర్) ఎమ్మెల్యేగా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎంపీగా షేర్ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆ డిపాజిట్ పోయిందిస అంటూ వ్యాఖ్యానించారు.
పార్టీ సభ్యత్వం వదులుకున్న వారిని క్షమించే నిబంధన కూడా ఉందని దానం నాగేందర్ తరపు న్యాయవాది ముకుల్.. న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా.. 'ఘర్ వాపసీనా' ఆ రూల్ ఇక్కడ వర్తించదని న్యాయమూర్తి అన్నారు. 'ఆయా రామ్, గయా రామ్, మళ్లీ ఆయా రామ్ కైసా?' అని వ్యాఖ్యానించారు. కాగా, దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించింది.
తీర్పును శిరసావహిస్తా: దానం
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని, ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దానం నాగేందర్ ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది తర్వాత చెబుతానని అన్నారు. ఖైరతాబాద్ ప్రజల మద్దతు తనకే ఉంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు.
అద్భుతమైన తీర్పు: కౌశిక్‌రెడ్డి
దానంపై అనర్హత వేటును తమ పార్టీ విజయంగా వర్ణించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలను అద్భుతమైన తీర్పుగా ఆయన వర్ణించారు. దానంపై మొదటి నుంచి తామే పోరాటం చేశామని, ఇప్పుడు బీజేపీ వచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి: త్వరలో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక
చారిత్రక విజయం: రాంచంద్రరావు
ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు స్వాగతించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు చారిత్రక విజయంగా ఆయన పేర్కొన్నారు. బీజేఎల్పీ చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.


