సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ విషయంలో ఉత్కంఠకు తెర పడింది. ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ ఉన్నత న్యాయస్థానం తీర్పునే సమర్థించడంతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం సాధారణంగా శాసనసభలో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి. అయితే మిగిలిన పదవీకాలం ఏడాది కంటే తక్కువగా ఉండటం వంటి చట్టపరమైన మినహాయింపులు ఉన్నాయి. కానీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి వీలైనంత త్వరగానే ఉప ఎన్నిక తేదీని ఈసీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
అక్టోబర్ 6న దేశంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసి..ప్రచారాలు నడుస్తున్నాయి. కాబట్టి ఖైరతాబాద్ ఆ చాన్స్ మిస్సయ్యింది. అయితే ఇప్పటి నుంచి ఏవైనా స్థానాలు ఖాళీ అయితే గనుక ఈసీ అధికారిక షెడ్యూల్ అతిత్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే ఖాళీపై అధికారిక సమాచారం అందిన వెంటనే ఎన్నికల సంఘం తన ప్రక్రియను ప్రారంభించే చాన్స్ ఉంది.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో.. సీటు ఖాళీ విషయాన్ని శాసనసభ ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దానం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఈసీకి సమాచారం వెళ్లే అవకాశం ఉంది. నియోజకవర్గ పరిస్థితులు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి ఈసీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను నిర్ణయిస్తుంది.
ఇదీ చదవండి: ఇక చాలూ.. ఉప ఎన్నికలకు వెళ్లండి


