సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ మాజీ మంత్రులకు చెందిన భూముల వ్యవహారాలపైనా పరిశీలన చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులకు సంబంధించిన భూముల వ్యవహారాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కుటుంబ సభ్యుల భూములు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ భూముల వ్యవహారాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూముల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించనుంది. మాజీ మంత్రులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు చెందిన భూములపైనా పరిశీలనలు జరపనున్నట్లు తెలుస్తోంది.
అసైన్డ్.. ప్రభుత్వ భూములపై ఫోకస్
అసైన్డ్, ప్రభుత్వ, భూదాన్ భూములకు సంబంధించిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కమిటీ దృష్టి సారించనుంది. మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు, మిడ్ మానేర్ ప్రాజెక్టు పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీల్లో అవకతవకల ఆరోపణలపైనా విచారణ జరపనుంది.
కమిటీ ఇలా..
ఈ విచారణ కమిటీకి ఐఏఎస్ అధికారి ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా ఉంటారు. వివిధ జిల్లాల్లోని భూ వ్యవహారాలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటికే 22-ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజా విచారణ కమిటీ పరిధి మాత్రం వివిధ రకాల భూ వ్యవహారాలు, ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించే దిశగా విస్తరించినట్లు తెలుస్తోంది.
ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపైనా..
భూ రికార్డుల నిర్వహణలో కీలకంగా ఉన్న ధరణి వ్యవస్థలోని మాడ్యూల్స్ దుర్వినియోగంపై కూడా విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వివిధ జిల్లాల్లో భూముల రికార్డులు, లావాదేవీలు, ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు–నిబంధనలకు అనుగుణంగా జరిగిన తీరును కమిటీ పరిశీలించనుంది.
బాధ్యులెవరో తేల్చి.. చర్యలకు సిఫారసు
విచారణలో అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే.. వాటికి బాధ్యులెవరో నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఇందుకోసం అవసరమైన భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను కమిటీకి అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విచారణకు పూర్తి సహకారం అందించాలని సూచించింది.


