భారత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల సంస్కరణలపై కాసేపట్లో కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ‘హైజాకింగ్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఇటు.. ఈసీని సంస్కరించాల్సిన అవసరం ఉందంటూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించారు.
ఈసీ వ్యవహారాలపై ఇకపై తమ ప్రధాన దృష్టి ఉంటుందని నిన్న సీజేపీ ప్రతినిధులు తెలిపారు. పార్టీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. పాఠశాలలు, నిరుద్యోగం, మౌలిక వసతులు వంటి అంశాలపై తమ ప్రచారాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకపోతే వాటి ద్వారా ఆశించిన మార్పు సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈసీపై తమకు ఉన్న అభ్యంతరాలను ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో వివరిస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో పేరిట కొత్త ఉద్యమం నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ఈసీలో ఎన్నికల కమిషనర్ల మధ్య బేదాభిప్రాయాలు నడుస్తున్నాయని.. పలు అంశాలపై ఆ ప్యానెల్‌లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపింది. అలాగే కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు–పునరుద్ధరణ, ఫారమ్–6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఐటీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఓటర్ల డేటాబేస్ కేంద్రీకృతం కావడంపై కూడా కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
ఫారమ్–6పై అభ్యంతరం
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్–6లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రశ్నను చేర్చడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదిక పేర్కొంది. నిబంధనల్లో మార్పు లేకుండా ఫారమ్‌లో మార్పు చేయడంపై కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది. అంతేకాదు.. గోవాలో 97 మంది ఓటర్లకు సంబంధించిన కేసులోనూ సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అర్హులని అధికారులు నిర్ధారించినప్పటికీ, వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు అవసరమైన సాంకేతిక సదుపాయం సకాలంలో అందుబాటులో లేకపోయిందని నివేదించింది.
పార్టీల నుంచి భిన్న స్పందనలు..
ఈసీలోని అంతర్గత అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు ఈ పరిణామాలపై ఈసీ తీరును ప్రశ్నించగా.. బీజేపీ మాత్రం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. దీంతో ఈసీ వ్యవహారంపై రాజకీయంగానూ చర్చ మొదలైంది.
ఈసీ వివరణ ఇదీ..
అయితే ఈ కథనంపై ఈసీ స్పందించింది. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక సూచనలు, సాంకేతిక అభిప్రాయాలు సాధారణ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌తో సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేనని పేర్కొంది. అంతర్గత నోట్స్‌లోని కొన్ని అంశాలను మాత్రమే చూపించడం వల్ల మొత్తం నిర్ణయ ప్రక్రియలోని మరో కోణం కనిపించదని తెలిపింది.
ఇప్పుడు సీజేపీ ఏం చెబుతుంది?
ఈ నేపథ్యంలోనే.. ఇప్పటివరకు స్కూల్స్ క్యాంపెయిన్ వంటి అంశాలపై దృష్టి పెట్టిన సీజేపీ హఠాత్తుగా ఈసీ సంస్కరణల అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తమ వైఖరిని ఢిల్లీలో జరిగే ప్రెస్‌మీట్‌లో వెల్లడించనుంది. ‘ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో’ పేరుతో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతుందా? ఈసీపై ఏవైనా కీలక డిమాండ్లు, కార్యాచరణ ప్రకటిస్తుందా? అన్నదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: ఐఐటీ బాంబే సాహిల్ కేసు.. సంచలన ఫుటేజీ బయటకు!


