ఎవరికీ తలవంచం..
శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు
అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దు
హార్మూజ్ వల్ల ఎవరూప్రయోజనం పొందడానికి వీల్లేదు
మేము ఉగ్రవాదులం కాదు.. ఉగ్రవాద బాధితులం
ఐరాస జనరల్ అసెంబ్లీలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
ఐక్యరాజ్యసమితి: అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. సంఘర్షణను ముగించడానికి దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దాడులకు ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు.
శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు. పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు.
ఈ విషయంలో ఇరాన్ ఎవరి అనుమతీ కోరబోదని పేర్కొన్నారు. అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు.
ఈ జలసంధిలో శత్రుదేశాల నౌకాదళాలను శాశ్వతంగా మోహరించడం, యుద్ధాన్ని విస్తరించడం వల్ల మనం ఆశించిన శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం పెజెస్కియాన్ ప్రసంగించారు. ఇరాన్ తన పొరుగు దేశాలను ప్రత్యర్థులుగా పరిగణించదని, బలమైన పొరుగు దేశాలు ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. టెహ్రాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలు ఈ జలమార్గాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము అంగీకరించబోమని వెల్లడించారు.
అమాయక విద్యార్థులను చంపడం ఏమిటి?
ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. తాము ఉగ్రవాదులం కాదని.. ముమ్మాటికీ ఉగ్రవాద బాధితులమని తేల్చిచెప్పారు. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా మారిందని అన్నారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మినాబ్ పాఠశాలపై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ రాక్షసకాండలో అమాయక చిన్నారులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ ఇరాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, జనరల్ అసెంబ్లీలో పెజెష్కియాన్ మాట్లాడుతుండగా అమెరికా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం.
అస్థిరతకు మేము కారణం కాదు
ప్రత్యర్థి దేశాలు తమ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న పిరికిపంద దాడులకు సాధారణ ప్రజలే లక్ష్యమయ్యారని ఆక్షేపించారు. ప్రత్యర్థులపై ఇరాన్ సైన్యం చేస్తున్న ప్రతిదాడులను సమర్థించుకున్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని చెప్పారు. తమ పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని తమ దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. తాము ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఇతర దేశాల్లోని సాధారణ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. గాజాలోని పరిస్థితిని సైతం ప్రస్తావించారు. అస్థిరతకు తాము కారణం కాదన్నారు. స్వతంత్రంగా జీవించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం ‘చాలా ఫలవంతమైనది’గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివరి్ణంచారు. అయితే, ఈ చర్చల ఫలితంగా అమెరికా, ఇరాన్ మధ్య తక్షణ ఒప్పందం గానీ, శాంతి సాధనలో పురోగతి గానీ కనిపించలేదు.


