పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్ నుంచి తమ భూభాగంలోకి ప్రవేశించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు పాకిస్థాన్ భద్రతా దళాలు వెల్లడించాయి. వాయవ్య పాకిస్థాన్‌లో ఈ డ్రోన్లను అడ్డుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
పాక్ భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. టోర్ఖమ్ సరిహద్దు ప్రాంతం సమీపంలో 4 డ్రోన్లను, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో మరో 4 డ్రోన్లను కూల్చివేశారు. వీటిలో కొన్ని సాధారణ నమూనాలకు చెందిన డ్రోన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోహాట్ సమీపంలో గుర్తించిన డ్రోన్లను “సాఫ్ట్-కిల్” విధానంలో నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. ఈ డ్రోన్లు జనసంచారం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు వచ్చినవని పాకిస్థాన్ అధికారులు ఆరోపించారు. పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్న మిలిటెంట్లకు అఫ్గాన్ తాలిబన్ మద్దతు ఇస్తోందనడానికి ఇది మరో ఆధారమని వారు పేర్కొన్నారు.
ఇదే సమయంలో సరిహద్దులో కాల్పులు కూడా జరిగాయి. పక్తియా, నంగర్‌హార్ ప్రావిన్సుల్లోని ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టుల సమీపం నుంచి మిలిటెంట్లు పాకిస్థాన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు అడ్డుకున్నాయని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. అనంతరం అఫ్గాన్ తాలిబన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై మోర్టార్లు, ఇతర భారీ ఆయుధాలతో కాల్పులు జరిపాయని, దీనికి ప్రతిగా తమ దళాలు తాలిబన్ పోస్టులు, మోర్టార్ ప్రాంతాలు, రక్షణ స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయని చెప్పారు. అఫ్గానిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.
ఇటీవలే వైమానిక దాడులు
ఈ పరిణామాలు సోమవారం పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌లో జరిపిన వైమానిక దాడుల తర్వాత చోటుచేసుకున్నాయి. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) స్థావరాలు, శిబిరాలపై దాడులు చేసినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఈ దాడుల్లో 28 మంది మిలిటెంట్లు, పలువురు ఆత్మాహుతి దాడిదారులు చనిపోయారని ఇస్లామాబాద్ పేర్కొంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు దీనిని ఖండిస్తూ తమ భూభాగంలోని గ్రామాల్లో ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ కూడా పౌరుల మరణాలను ధ్రువీకరించగా, కాబూల్ అధికారికంగా నిరసన తెలిపింది.
అఫ్గాన్ తాలిబన్‌తో టీటీపీకి సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు సంస్థలు వేర్వేరు. 2021లో తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ నేతలకు ఆశ్రయం కల్పిస్తున్నారని, అఫ్గానిస్థాన్ భూభాగాన్ని పాకిస్థాన్‌పై దాడులకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. కాబూల్ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ వ్యతిరేకంగా పనిచేస్తున్న 25కు పైగా మిలిటెంట్ సంస్థలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా డ్రోన్ ఘటనలు, సరిహద్దు కాల్పులు ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఇస్లామాబాద్-కాబూల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా, టర్కియే, ఖతార్, సౌదీ అరేబియా చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై కూడా తాజా పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.


