మరో షాక్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ ముగ్గురు సోదరీమణుల అరెస్ట్‌ | Imran Khan 3 Sisters Arrested Ahead Of His Partys Planned Protest | Sakshi
Sakshi News home page

మరో షాక్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌ ముగ్గురు సోదరీమణుల అరెస్ట్‌

Sep 22 2026 3:32 AM | Updated on Sep 22 2026 3:32 AM

Imran Khan 3 Sisters Arrested Ahead Of His Partys Planned Protest

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరీమణులు ముగ్గురిని పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) సెప్టెంబర్‌ 27న నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఇమ్రాన్‌ సోదరీమణులు అలీమా ఖాన్‌, డాక్టర్‌ ఉజ్మా ఖాన్‌, నరీన్‌ ఖాన్‌లను లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలుకు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పీటీఐ ప్రతినిధి జుల్‌ఫీ బుఖారీ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ పోలీసులు అలీమా ఖాన్‌ ఇంటిపై దాడి చేసి, ఇమ్రాన్‌ మరో ఇద్దరు సోదరీమణులతో పాటు ఆయన మేనల్లుళ్లు, వారి పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను తర్వాత విడుదల చేసినట్లు పీటీఐ సమాచార కార్యదర్శి షేక్‌ వక్వాస్‌ అక్రమ్‌ తెలిపారు. ముగ్గురు సోదరీమణులను కోట్‌ లఖ్‌పత్‌ జైలుకు పంపినట్లు ఆయన చెప్పారు.

లాహోర్‌ డిప్యూటీ కమిషనర్‌ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో అమల్లో ఉన్న ప్రజా శాంతి పరిరక్షణ చట్టం కింద ముగ్గురు సోదరీమణులను 30 రోజుల పాటు నిర్బంధించేందుకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఏఎఫ్‌పీ చూసిన వాటి ప్రతుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై పంజాబ్‌ పోలీసులు స్పందించలేదు.

ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ సెప్టెంబర్‌ 27న నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిరసనకు పిలుపు చట్టవిరుద్ధమని పాకిస్థాన్‌ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్‌ ఆదివారం అన్నారు. “వారు రహదారులను దిగ్బంధించి, ప్రజల జీవితాలకు అంతరాయం కలిగించేందుకు మేము అనుమతించం” అని ఆయన పేర్కొన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 నుంచి జైలులో ఉన్నారు. గత ఏడాది చివర్లో అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు, ఆయన భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ ఆరోపణలను ఇద్దరూ తిరస్కరించారు. 2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్‌ ఖాన్‌.. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement