వెస్టిండీస్ గడ్డపై పాకిస్తాన్ యువ ఓపెనర్ మాజ్ సదాకత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో రికార్డుల మోత మోగించాడు.
ఈ టోర్నీ ఎలిమనేటర్ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన అతడు.. తాజాగా జరిగిన ఫైనల్లోనూ సుడిగాలి శతకం బాది, లీగ్ చరిత్రలో రెండు శతకాలు బాదిన తొలి పాకిస్తానీ క్రికెటర్‌గా, ఫైనల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. సదాకత్ సెంచరీల మోత మోగించి, రికార్డు ప్రదర్శన చేసినా, అతడి జట్టు జమైకా కింగ్స్‌మన్ ఫైనల్లో ఓడిపోవడం కొసమెరుపు.
ఛాంపియన్‌గా ఆంటిగ్వా ఫాల్కన్స్
ఇవాళ జరిగిన ఫైనల్లో జమైకా కింగ్స్‌మన్ ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్ కింగ్స్‌మన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్‌మన్, సదాకత్ సూపర్ శతకంతో (58 బంతుల్లో 114; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సదాకత్ మినహా ఎవ్వరూ రాణించకపోవడంతో కింగ్స్‌మన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. సదాకత్‌తో పాటు జట్టు ఇన్నింగ్స్‌లో మరో పాక్ ప్లేయర్ సైమ్ అయూబ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు.
కింగ్స్‌మన్ బ్యాటర్లను బోల్తా కొట్టించింది కూడా పాక్ ప్లేయరే కావడం మరో విశేషం. ఫాల్కన్స్‌కు ఆడుతున్న పాక్ స్పిన్నర్ సుఫ్యాన్ ముఖీమ్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి నలుగురు కింగ్స్‌మన్ బ్యాటర్లను ఔట్ చేశాడు. అతడికి అల్జరీ జోసఫ్ (4-0-27-2), షాదాబ్ ఖాన్ (4-0-28-1), జేడన్ సీల్స్ (2-0-18-1), షమార్ స్పింగర్ (1-0-10-1) తోడవ్వడంతో కింగ్స్‌మన్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.
అనంతరం ఫాల్కన్స్ బ్యాటర్లు 171 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ (16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి) ఛేదించారు. ఆమిర్ జాంగూ (57 నాటౌట్), హసన్ నవాజ్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫాల్కన్స్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు ఎవిన్ లెవిస్ (38), రఖీమ్ కార్న్‌వాల్ (20) శుభారంభం అందించారు.
ఇదీ చదవండి: Asian Games 2026: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్


