చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన వాషింగ్టన్ చేరుకోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల అమలు, కీలక ఖనిజాల సరఫరా, సెమీకండక్టర్లు వంటి అంశాలు ఈ శిఖరాగ్ర భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
జిన్‌పింగ్ పర్యటనకు ముందు న్యూయార్క్‌లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, చైనా ఉప ప్రధాని హీ లైఫెంగ్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. గతంలో కుదిరిన ఆర్థిక, వాణిజ్య అవగాహనలను అమలు చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, కృత్రిమ మేధపై చర్చించడం ఇందులో ఉన్నాయి. అమెరికా వైపు నుంచి రైతులు, తయారీదారులు, కార్మికులకు మార్కెట్ అవకాశాలు పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.
జాతీయ భద్రత కోణంలో..
ఈ భేటీలో కృత్రిమ మేధకు సంబంధించి ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. కృత్రిమ మేధ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో ఏదైనా ఘటన జరిగితే ఇరు దేశాలు ముందుగానే ఒకరినొకరు అప్రమత్తం చేసుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిని అనధికారికంగా ‘కృత్రిమ మేధ హాట్‌లైన్’గా పేర్కొంటున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో సమాచారం తప్పనిసరిగా పంచుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. చైనా ఈ ప్రతిపాదనను అంగీకరించిందా లేదా అన్నది కూడా వెల్లడించలేదు.
రేర్ ఎర్త్, కీలక ఖనిజాల సరఫరా కూడా ఇరు దేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా ఉంది. సెమీకండక్టర్ల విషయంలో చైనాకు ఆ చిప్‌లు లభించే అవకాశాన్ని అమెరికా పరిమితం చేస్తోంది. అదే సమయంలో చైనా.. పరిమితుల మధ్య కూడా కృత్రిమ మేధ నమూనాలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 2025లో అమెరికా సంస్థలు కృత్రిమ మేధ రంగంలో 285.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, చైనా సంస్థల పెట్టుబడి 12.4 బిలియన్ డాలర్లుగా స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ 2026 కృత్రిమ మేధ సూచీ నివేదిక పేర్కొంది.
వాణిజ్యంతో పాటు రష్యాపై అమెరికా ఆంక్షలు, ఇరాన్‌తో అమెరికా ఘర్షణ, తైవాన్, అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం వంటి అంశాలు కూడా భేటీపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్-ట్రంప్ చర్చల్లో ఆర్థిక విభేదాల నిర్వహణతో పాటు కృత్రిమ మేధ రంగంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఇరు దేశాలు ఏ మేరకు సహకార మార్గాన్ని ఏర్పరచుకుంటాయన్నది కీలకంగా మారనుంది.


