పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. షేకాన్ ప్రాంతంలోని ఓ శ్మశానవాటికలో సమాధి నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీస్తున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో అతని నోటి నుంచి దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి.
పెషావర్ సదర్ ఎస్పీ ఫిదా హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల సల్మాన్ బాలికల సమాధులను లక్ష్యంగా చేసుకున్నాడు. మృతదేహాలను వెలికితీస్తున్న టైంలో శ్మశానవాటిక వాచ్‌మన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించాడు. తొలుత వాటిని తవ్విచూసి .. మృతదేహాలను అవమానిస్తూ మానసిక ఆనందం పొందాడేమోనని భావించారు. అయితే మృతదేహాల్ని వెలికి తీసి.. వాటిపై అతను లైంగిక వాంఛలు తీర్చుకున్నాడనే విషయం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.
అలా సల్మాన్ ఇప్పటిదాకా పదికి పైగా సమాధులను ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతలో ఈ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయం జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది.

దర్యాప్తులో భాగంగా నిందితుడిని ఘటనాస్థలాలను గుర్తించేందుకు పోలీసులు షేకాన్ శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా.. మోటార్‌సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పోలీసుల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చేపట్టారు.
కేసులో తేలాల్సిన అంశాలెన్నో..
నిందితుడు పోలీసుల కస్టడీలోనే మరణించడంతో.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. సమాధుల్లోనూ మహిళలకు కరువైందనే చర్చా అక్కడ నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ తరహా ముఠాలు అక్కడ చాలానే ఉన్నాయనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: రెండుసార్లు పుట్టిన బిడ్డ గురించి తెలుసా?


