అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. ఆయన రాయబారులు, ఇరాన్ ప్రతినిధులు మధ్యే చర్చలు సాగాయి. ఈ భేటీపై ట్రంప్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌కు ఒప్పందం చేసుకోవడం ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు విట్‌కాఫ్ కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగాయని, అవి నిర్మాణాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు.
హర్ముజ్ తెరవాలంటే మూడు షరతులు
ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మొదటిది.. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలి.
రెండోది.. అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.
మూడోది.. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్ల’పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలి.
ఈ షరతులను నెరవేర్చినట్లయితే హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవగలమని ఇరాన్ గతంలోనే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఆ విషయంలో ట్రంప్ ‘నో’
మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం కీలకమైన అంశం మారలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో కూడా ఇరాన్ విషయంలో తన ముందు రెండు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకటి ఒప్పందం చేసుకుని ఇరాన్ భవిష్యత్తును మార్చడం.. మరో మార్గం తీవ్ర సైనిక చర్య అని హెచ్చరించారు.
అయితే అదే సమయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ‘ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకుంటాం.. వేగంగా పూర్తి చేస్తాం’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ ఒకవైపు కఠిన హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది.
వాళ్లే ముందడుగు వేయాలి
ఇరాన్ వైపు నుంచి కూడా తాజాగా దౌత్యానికి అవకాశం ఉందన్న సంకేతాలు వచ్చాయి. అమెరికా నిజంగా సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలనుకుంటున్నట్లు అధికారికంగా స్పష్టం చేయాలని, ఆ తర్వాత చర్చలకు విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేయాలని ఇరాన్ కోరుతోంది.
ఇక హర్ముజ్ విషయంలోనూ ఇదే వైఖరిని ఇరాన్ అవలంబిస్తోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరవడానికి సిద్ధమని చెబుతోంది. అంటే ముందుగా అమెరికా చర్య తీసుకోవాలి.. ఆ తర్వాతే హర్ముజ్ తెరుచుకుంటుందన్నది ఇరాన్ ప్రతిపాదన.
ఇప్పట్లో డీల్ కష్టమేనా?
మూడు గంటల చర్చలు జరిగినప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. సమావేశంలో కొన్ని షరతులు, యుద్ధం ముగింపు మార్గాలు, హర్ముజ్ పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం పరిస్థితి ‘యుద్ధం నుంచి చర్చల వైపు అడుగు’ వేసినంతవరకే ఉంది. అమెరికా తన సైనిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ఇరాన్ డిమాండ్ కాగా.. ఇరాన్ అణ్వాయుధం దిశగా వెళ్లకుండా హామీ ఇవ్వాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఈ రెండు వైఖరుల మధ్యే అసలు పేచీ ఉంది.
ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే..
హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతులను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా హర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మౌలిక వసతులపై చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లో జరిగిన ఈ మూడు గంటల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. తదుపరి చర్చల్లో ఈ రెండు వైఖరుల మధ్య ఎంతవరకు సయోధ్య కుదురుతుందన్నదే అసలు కీలకం కానుంది.
ఇదీ చదవండి: నా మాట వినకపోతే మీ గతి అదోగతే!


