హౌతీల దాడులతో మారిన యుద్ధక్షేత్రం | Sakshi Guest Column On Houthis Changing Battlefield | Sakshi
Sakshi News home page

హౌతీల దాడులతో మారిన యుద్ధక్షేత్రం

Sep 23 2026 12:22 AM | Updated on Sep 23 2026 12:22 AM

Sakshi Guest Column On Houthis Changing Battlefield

సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా హౌతీ మద్దతుదారుల నిరసన

విశ్లేషణ

ఈ సెప్టెంబరు నెలలో ఇరాన్‌ యుద్ధ క్షేత్రం హార్మూజ్‌ జలసంధి నుంచి సౌదీ అరేబియా, యెమెన్‌లకు మారింది. గాజా –ఇజ్రాయెల్‌ యుద్ధం తరువాత మళ్లీ ఒక్కసారిగా హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌ మధ్య, దక్షిణ ప్రాంతాలలోనికి చొచ్చుకుపోయారు. ఎర్రసముద్రాన్ని, బాబెల్‌ మాండెబ్‌ జలసంధిని దాదాపుగా తమ నియంత్రణలోనికి తీసుకొని నేరుగా సౌదీ అరేబియాపై భీకర దాడులు ప్రారంభించటం ద్వారా సౌదీ– అమెరికా–ఇజ్రాయెల్‌లకు హౌతీలు సవాలు విసిరినట్లయింది. 

ఎవరీ హౌతీలు?
ఉత్తర యెమెన్‌లోని సాదా పర్వత ప్రాంతాలలో నివసించే షియా ఇస్లాంకు చెందిన ‘జ్యాదీ’ తెగ ప్రజలనే ‘హౌతీ’లుగా పిలుస్తారు. గత వెయ్యేళ్లుగా ఉత్తర యెమెన్‌ ప్రాంతాన్ని జ్యాదీ తెగకు చెందిన ఇమామ్‌లు పాలించారు. 1962లో ఇమామ్‌ల పాలనను కూలదోసి ఉత్తర యెమెన్‌ రిపబ్లిక్‌ ఏర్పడింది. 1990వ దశకంలో ఉత్తర–దక్షిణ యెమెన్‌ల విలీనంతో సానా రాజధానిగా యెమెన్‌ ఏర్పడింది. జ్యాదీ తెగకే చెందిన అలీ అబ్దుల్లా సాలే యెమెన్‌ను పరిపాలిస్తూ సౌదీ అనుకూల సలాఫి మదరసాలను ప్రోత్సహించాడు. దీన్ని తమ సంస్కృతిని నిర్మూలించే ప్రక్రియగా భావించిన జ్యాదీలు తిరుగుబాటు ప్రారంభించారు. హుస్సేన్‌ అల్‌ హౌతీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు మొదలైంది. 2004–10 కాలంలో అబ్దుల్లా ప్రభుత్వానికీ, హౌతీలకూ మధ్య ఆరు యుద్ధాలు జరి గాయి. సానాలోని యెమెన్‌ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు నివ్వటంతో అది హౌతీలకు శత్రువయింది.

2011లో ఉత్తర ఆఫ్రికాలో ప్రారంభమైన అరబ్‌ స్ప్రింగ్‌ నిరసనలు యెమెన్‌కూ వ్యాపించాయి. 2012లో అబ్దుల్లా సాలే రాజీ నామాతో సౌదీ సహాయంతో మన్సూర్‌ హాదీ అధ్యక్షుడిగా మరో ప్రభుత్వం ఏర్పడింది. అందులో హౌతీలకూ స్థానం కల్పించారు. కానీ చమురు నిల్వలున్న దక్షిణ–మధ్య యెమెన్‌లతో పోలిస్తే జ్యాదీల (హౌతీల) ఉత్తర యెమెన్‌లో పేదరికం అధికం. 2014లో చమురు సబ్సిడీలను ఎత్తివేయటంతో హౌతీలు తిరుగుబాటు ప్రారంభించారు. దీనితో హాదీ ప్రభుత్వం కూలిపోయింది. సౌదీ అరేబియా జోక్యంతో 2015–22 మధ్య హౌతీలకూ, సౌదీ మద్దతున్న యెమెనీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. 2022లో యునైటెడ్‌ నేషన్స్‌ చొరవతో కొంతమేరకు శాంతిస్థాపన జరిగింది. ఇదే సమయంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మద్దతుతో కొన్ని స్థానిక తెగలు దక్షిణ యెమెన్‌లోని కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఇప్పుడు యెమెన్‌లో సుమారు 30 శాతం ప్రాంతం హౌతీల అధీనంలో ఉండగా, మిగిలిన ప్రాంతం సౌదీ మద్దతున్న ఇంటర్నే షనల్లీ రికగ్నయిజ్డ్‌ గవర్నమెంట్, యూఏఈ మద్దతున్న సదరన్‌ ట్రాన్సిషన్‌ కౌన్సిల్‌ అధీనంలో ఉన్నాయి. 80 శాతం ప్రజలు హౌతీల అధీనంలోని ఉత్తర యెమెన్‌లో నివసిస్తున్నారు.

సంకటంలో సౌదీ అరేబియా
ఇరాన్‌ మతగురువు అయతుల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న హౌతీ నాయకుల ఇరానియన్‌ విమానం యెమెన్‌ రాజధాని సానాలో ల్యాండ్‌ అవకుండా సౌదీ అరేబియా విమానాశ్రయ రన్‌వేను ధ్వంసం చేయటంతో జూలై 2026లో అప్ప టివరకు ఉన్న కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం రద్దయ్యాయి. హార్మూజ్‌ జలసంధిపై అమెరికా తన పట్టు బిగించటంతో హౌతీలు ఎర్ర సముద్రంలో పెరిమ్, అల్‌ హయిదా దీవులను వశం చేసుకున్నారు. కీలకమైన మోకా రేవు పట్టణాన్ని అదుపులోనికి తీసు కోవటంతో బాబెల్‌ మాండెబ్‌ జలసంధిని నియంత్రిస్తున్నారు. ఎర్ర సముద్రం నుండి సౌదీ నౌకలపై నిషేధం విధించారు. హార్మూజ్‌ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా అబాకిక్‌ చమురు క్షేత్రాన్ని ఎర్ర సముద్ర తీరంలోని యాన్‌బూ రేవు పట్టణంతో కలిపే 1,200 కిలోమీటర్ల తూర్పు–పశ్చిమ పైప్‌లైన్‌ గుండా ప్రతిరోజూ 7 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురును ఎగుమతి చేస్తున్నది. సౌదీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ పైప్‌లైన్‌పై హౌతీలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అరామ్‌కో కంపెనీకి చెందిన చమురుశుద్ధి కర్మాగారాలు, చమురు టర్మినల్స్‌పై కూడా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి జరిగింది. తాయిఫ్, ఆభా, రియాద్, జీజన్, నజ్రాన్‌లపై దాడితో సౌదీ సంకట స్థితిలో పడింది.

సాలీనా 83 బిలియన్‌ డాలర్ల రక్షణ వ్యయంతో సౌదీ అరేబియా ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది. అమెరికన్‌ ఎఫ్‌–15 యుద్ధ విమానాలు, పేట్రియాట్, థాడ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు కలిగి ఉన్న సౌదీ అరేబియాలో విధ్వంసం సృష్టించటంతో హౌతీల సైనిక శక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. హిజ్బుల్లా మాదిరిగా హౌతీలను ఇరానియన్‌ ప్రాక్సీలుగా పరిగణిస్తారు. హౌతీలకు క్రూయిజ్, బాలాస్టిక్‌ మిస్సైల్స్, డ్రోన్‌ టెక్నాలజీని, ఆర్థిక సహా యాన్ని ఇరాన్‌ అందించటంలో సందేహం లేదు. అయినా హౌతీల గెరిల్లా పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు. వారు ఇరాన్‌తో మైత్రీ బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, పూర్తిగా ఇరాన్‌పై ఆధారపడటం లేదు. ఇరాన్‌ ప్రయోజనాలను కాపాడినప్పటికీ, తమ ప్రాంతీయ లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఇరాన్‌కు ప్రధాన శత్రు వులు యూఎస్‌ఏ, ఇజ్రాయెల్‌. కానీ హౌతీల శత్రువు సౌదీ. 

రాజీ కుదిరేనా?
వైమానిక దాడులలో హౌతీలను లొంగదీసుకోవడం సాధ్యం కాదని సౌదీకి తేటతెల్లమైంది. దిక్కుతోచని పరిస్థితులలో మళ్లీ ట్రంప్‌ సహాయాన్ని అర్థించింది. కానీ ట్రంప్‌ తెలివిగా హౌతీలపై ప్రత్యక్ష దాడులకు నిరాకరించాడు. ఇజ్రాయెల్‌ సహాయాన్ని కూడా సౌదీ అర్థించినట్లుగా వార్తలొస్తున్నాయి. సైనికపరంగా హౌతీలను ఎదుర్కొనలేమని దౌత్యమార్గంలో సంప్రదింపులకు తలుపులు తెరి చింది. ఒమన్, ఈజిప్టు మధ్యవర్తులుగా ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. ఇరాన్‌ ద్వారా హౌతీలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుత యుద్ధాన్ని తన నుండి ప్రక్కకు మరల్చటానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైకి చేరటం భారత్‌ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతం. భారత్‌ చమురును రష్యా నుండి బాబెల్‌ మాండెబ్‌ ద్వారానే దిగుమతి చేసుకుంటున్నది. ఈ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి సహజంగానే ఆందోళన కలిగించే అంశం. ఇరాన్, ఒమన్‌లతో మనకున్న సత్సంబంధాలను ఉపయోగించి బాబెల్‌ మాండెబ్‌ ద్వారా మన చమురు దిగుమతు లకు ఆటంకం లేకుండా చేయటానికి దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఇదే సమయంలో సౌదీతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. ఇది కత్తిమీద సామే.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement