అభిప్రాయం
రిజర్వేషన్‌ను కేవలం ఒక శాతంగా చూస్తే దాని వెనుక ఉన్న సామాజిక చరిత్ర కనిపించదు. ఒక మారుమూల తండాలో పుట్టిన విద్యార్థి ఉన్నత విద్యా సంస్థ గేటు దాటి నప్పుడు, ఒక గిరిజన యువతి ప్రభుత్వ ఉద్యో గంలో అడుగుపెట్టినప్పుడు, ఒక తండా తన సొంత గ్రామపంచాయతీగా తన అవసరాలపై తానే నిర్ణయం తీసుకునే స్థాయికి వచ్చినప్పుడు– అప్పుడే రిజర్వేషన్, స్వపరిపాలన వంటి విధా నాల అసలు అర్థం తెలుస్తుంది.
2011 జనగణన ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. అయితే ఎన్నో సంవత్సరాలుగా విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో ఎస్టీలకు అమ లైన రిజర్వేషన్ 6 శాతంగానే కొనసాగింది. 2022 సెప్టెంబర్ 30న తెలంగాణ ప్రభుత్వం జీఓ ఎమ్‌ఎస్ నం.33 గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. అనంతరం రాష్ట్ర సేవల రోస్టర్ నిబంధ నల్లో కూడా సంబంధిత సవరణలు జరిగాయి. 2026 విద్యా ప్రవేశ నిబంధనల్లోనూ 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ అమలులో ఉన్నట్లు నోటిఫికేషన్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం నాలుగు శాతం పెరుగుదల కాదు. జనాభా వాస్తవికతకు అవకా శాల వ్యవస్థను దగ్గర చేసే ప్రయత్నం.
తండా ఒక చిరునామా మాత్రమే కాదు!
‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018’ అమ లులో భాగంగా తక్కువ జనాభా గల గ్రామాలు, గిరిజన తండాలు, ఇప్పటికే ఉన్న గ్రామపంచాయతీ కేంద్రాలకు దూరంగా ఉన్న ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీని అసలు విలువ కొత్త పంచాయతీ కార్యాలయం ఏర్పడటంలో మాత్రమే లేదు. సమస్య తండాలో ఉండి, నిర్ణయం మరో గ్రామంలో తీసు కునే పాత పరిస్థితి నుంచి ‘మన తండాకు మన గ్రామసభ, మన అవసరాలకు మన ప్రాధాన్యత’ అనే స్థానిక స్వపరిపాలన భావనకు మార్పు రావడం ముఖ్యమైన అంశం.
2017లో తెలంగాణ ప్రభుత్వం ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం లక్ష్యం ఎస్సీ, ఎస్టీ జనాభా వాటాకు అనుగుణంగా అభివృద్ధి వ్యయాన్ని కేటాయించడం; ఆర్థిక, విద్య, మానవాభివృద్ధి సూచికల్లో ఉన్న అంతరాలను తగ్గించడం; సామాజిక గౌరవం, సమానత్వాన్ని బలోపేతం చేయడం. గిరిజన అభివృద్ధి ఒక శాఖకు మాత్రమే పరిమి తమైన బాధ్యత కాకుండా, మొత్తం ప్రభుత్వ ప్రణాళికలో కనిపించాలన్న ఆలోచనకు ఇది సంస్థాగత రూపం ఇచ్చింది. అందువల్ల గిరిజన విధానాల తదుపరి దశ ‘హక్కు కల్పించాం’ అన్న దగ్గర ఆగకూడదు.
ఆ హక్కును ఉపయోగించు కునే సామర్థ్యాన్ని కూడా సమాజానికి అందించాలి. రిజర్వేషన్ ఉన్నా పోటీకి అవసరమైన విద్య లేకపోతే ప్రయోజనం పరిమితమవుతుంది. గ్రామపంచాయతీ ఉన్నా తగిన నిధులు, సిబ్బంది, మౌలిక వసతులు లేకపోతే స్వపరి పాలన బలహీనమవుతుంది. తండాను గ్రామపంచాయతీగా గుర్తించడం మొదటి అడుగు. ఆ గ్రామపంచాయతీని మంచి పాఠశాల, ఆరోగ్య సేవ, రహదారి, తాగునీరు, ఉపాధి అవకాశాలు ఉన్న సమాన అవకాశాల గ్రామంగా తీర్చిదిద్దడం తదుపరి అడుగు.
ప్రభుత్వాలు మారుతాయి. రాజకీయ పరిస్థి తులూ మారుతాయి. కానీ ఒక సమాజానికి లభించిన విద్యా అవకాశం, ప్రాతినిధ్యం, స్థానిక స్వపరి పాలన వంటి హక్కులను ప్రతి ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలి. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో అమలులోకి వచ్చిన 10 శాతం ఎస్టీ రిజర్వేషన్, తండాల గ్రామపంచాయతీ పునర్వ్య వస్థీకరణ, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి వంటి నిర్ణయాలు గిరిజన విధాన చరిత్రలో స్పష్టంగా నమోదు కావాల్సిన అంశాలు.
అదే సమయంలో వాటి అమలులో మిగిలిన లోటు పాట్లను ప్రస్తుత, భవిష్యత్ ప్రభుత్వాలు పూరించడం కూడా అంతే అవసరం. ప్రతి తండాకు నాణ్యమైన పాఠశాల, ప్రతి గిరిజన విద్యార్థికి ఉన్నత విద్యకు చేరుకునే అవ కాశం, యువతకు నైపుణ్యం–ఉపాధి, ప్రతి గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు, రాజ్యాంగ హక్కులు ఆచరణలో అందే వ్యవస్థ – ఇవే తదుపరి లక్ష్యాలు కావాలి.
- డా. బానోత్ చంద్రావతి, వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే, వైరా
ఇదీ చదవండి: కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్'!


