మాధవ్ శింగరాజు
నిజాన్ని ఎంత లోతుకు పాతి పెట్టినా ఏదో ఒకనాటికైనా అది మొలకెత్తకుండా ఉండ లేదు. చేవ లేని అబద్ధపు చెట్టును మోసుకొచ్చి ఎంత సారవంతమైన భూమిలో నాటినా, ఏనాటికీ అది చిన్న చిగురైనా వేయలేదు. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇండియాలో బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తున్న ప్పుడు నాకు తీవ్రాతి తీవ్రంగా ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే నేను ఇండియా ఏర్పాటు చేసిన అధికారిక విందులో కనిపించలేదని, ఇండియా నుంచి అర్ధంతరంగా చైనాకు తిరిగి వచ్చాక, అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన నన్ను బీజింగ్‌లోని చైనీస్ పీపుల్స్ ఆర్మీ జనరల్ హాస్పిటల్‌కు తరలించా రని... వాంజున్ జియ్ అనే మనిషి గత వారంరోజులుగా ప్రపంచం అంతటా ప్రధాన కూడళ్లలో అబద్ధపు చెట్లను నాటే పనిలో ఉన్నాడు. ‘చైనా డెమోక్రసీ పార్టీ’ నాయకుడినని చెప్పుకుంటూ అమెరికాలో ఉంటున్న వాంజున్ జియ్ తనకై తనే ఒక పెద్ద అబద్ధం. చైనాలో అతడి ‘చైనా డెమోక్రసీ పార్టీ’ చట్ట విరుద్ధం. తియానన్మెన్ స్క్వేర్ నిరసనకారుడు అతడు. 25 ఏళ్ల క్రితమే చైనా నుంచి పారిపోయిన వాడు. పారిపోయి, ‘జోంగ్నాన్హాయ్’పై రోజుకో అసత్యాన్ని రాయిలా విసురుతున్నవాడు.
‘జోంగ్నాన్హాయ్’... చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయం. వాంజున్ జియ్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ వ్యతిరేకి. ‘‘ఈ డెమోక్రాటిక్ గుడ్లగూబను ఏం చేద్దాం కామ్రేడ్?’’ అని అడిగాను వాంగ్‌ని. ‘‘కొన్ని సందర్భాలలో ఏమీ చెయ్యకుండా ఉండటమే ఏదైనా చెయ్యటం అవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నారు వాంగ్! వాంగ్ విదేశాంగ మంత్రి. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ సీనియర్ దౌత్యవేత్త. అంతకన్నా కూడా నాకు నమ్మకస్థుడు. బ్రిక్స్ డిన్నర్‌లో నేను లేకపోవటానికి కారణం... హోటల్ గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని నా మనసు కోరుకోవటం తప్ప మరింకేమీ కాదు. గ్లాసులు పైకెత్తి ‘టోస్ట్’ చెప్పుకునే సందడి కంటే కూడా, కొన్నిసార్లు నాకు నిశ్శబ్దమే తృప్తికరమైన డిన్నర్‌లా ఉంటుంది. సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం. ఆ వివరాలు చెబుతున్నారు వాంగ్.
‘‘వైట్ హౌస్‌లో ఆరోజు అధికారిక ‘స్టేట్ డిన్నర్’ ఉంటుంది మిస్టర్ ప్రెసిడెంట్. డిన్నర్‌లో మీతో పాటు టెక్ టైకూన్ లు... టిమ్ కుక్, సామ్ ఆల్ట్‌మాన్, జెన్సన్ హువాంగ్ ఉంటారు. ఇక, ట్రంప్ మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పటానికి వైట్ హౌస్ లాన్ లో మీ కోసమే ప్రత్యేకంగా కొత్త హెలిప్యాడ్‌ను కట్టించారు... ’’ అని చెప్పారు వాంగ్ యీ! వాంగ్ సాధారణంగా ముఖ్యమైన వివరాలను మాత్రమే నాకు చెబుతారు. మిగతావన్నీ తనే చూసుకుంటారు. నిజానికి డిన్నర్ కంటే ముఖ్యంగా... వాషింగ్టన్‌లో నేను మాట్లాడవలసినవి చాలానే ఉన్నాయి. వాణిజ్య సుంకాల ఇష్యూ ఉంది. ఏఐ నియంత్రణల ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ, వ్యాపార రంగాలలో ఇచ్చిపుచుకోవడం ఉంది. రేర్ ఎర్త్ ఖనిజాలపై కీలక చర్చలు ఉన్నాయి. తైవాన్ కు అమెరికా ఆయుధాల సరఫరా జరగకుండా ఆపటమూ ఉంది. ఇన్ని ముఖ్యమైన వాటిని వాంగ్ తను చూసుకోగలనని అనుకుంటున్నారంటే... వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ ఇంకెంత ముఖ్యమైనదో ఆయనకు క్లారిటీ ఉన్నట్లుంది.
‘‘మిస్టర్ ప్రెసిడెంట్, సెప్టెంబర్ 12న ఇండియాలో మీరు డిన్నర్ చేయకుండా, సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో డిన్నర్ చేశారంటే... ఇండియాలోని చైనీయులు, చైనాలోని ఇండియన్‌లు ఏమీ అనుకోరు. కానీ ఇండియాలో డిన్నర్ చేయలేదు కనుక, వైట్ హౌస్‌లోనూ డిన్నర్ చేయకుండా ఉన్నారంటే... అమెరికాలోని చైనీస్ డెమొక్రాట్‌లు, చైనాలోని అమెరికన్ డెమొక్రాట్‌లు మళ్లీ మీ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన హెల్త్ బులెటిన్‌లు వాళ్లు విడుదల చేసే అవకాశం ఉంది’’అన్నారు వాంగ్. ఆయనేమీ నవ్వుతూ ఆ మాట అనలేదు.


