సందర్భం
మోదీ శకంలో చిరకాలం నిలిచిపోయే గొప్ప విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కనిపించకపోవచ్చు. అంతకంటే లోతైన అంశంలో అది ఉంది. భారత ప్రధాన స్రవంతి విస్తరించటమే ఆ విజయం. నేను భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఆయనను ప్రధానమంత్రిగా దగ్గరగా గమనించాను. ఆ అనుభవంతో పాటు ప్రజా జీవితంలో ఆయనతో నాకున్న అనుబంధం ఆధారంగా, ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, 2014 నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఎన్నికైన ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు నాయకత్వం వహించిన ప్రధాని మోదీ... ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సరళమైన, పరివర్తనాత్మక ఆలోచనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఆయన సమ్మిళిత రాజకీయాలకు నిర్వచనంగా మారిన మరో భావన దీనికి కేంద్రం: ‘జిస్కో కిసీ నే నహీ పూఛా, ఉస్కో మోదీ నే పూజా’. అంటే ఎవరూ పట్టించుకోని వారికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి అంచె వరకు అభివృద్ధిని తీసుకెళ్లటమే కాకుండా, ఆ అంచుల్లో ఉన్నవారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావటం మోదీ శకంలో అత్యంత ప్రభావవంతమైన మార్పు కావచ్చు.
మారిన ఈశాన్య కథ
స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలపాటు భారత అభివృద్ధి ఆలోచనలో ఒక కేంద్రం, దానికి వెలుపల పరిధి ఉన్నట్లు భావించేవారు. కొన్ని ఆకాంక్షలకు జాతీయ చర్చలో అసలు చోటే దక్కలేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. దాని ప్రయోజనం పొందే అవకాశం చివరి వ్యక్తికి నిజంగా చేరిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్పును ఈశాన్య ప్రాంతం కంటే మెరుగ్గా వివరించే ఉదాహరణలు చాలా తక్కువ. దశాబ్దాలపాటు ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంగానే ఎక్కువగా భావించారు. మోదీ నాయకత్వంలో అది భారత్ ముఖంగా, ఆగ్నేయాసియాకు ప్రవేశ ద్వారంగా క్రమంగా గుర్తింపు పొందింది. 2014 నవంబర్ నుంచి ప్రధాని మోదీ 83 సార్లకు పైగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో 12 ప్రధాన శాంతి ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు దశాబ్దంలో దాదాపు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014–15 నుంచి 2025–26 మధ్య అభివృద్ధికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. బోగీబీల్ వంతెన, సెలా సొరంగం... కఠినమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబీ–సైరాంగ్ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాంకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో తొలిసారి నేరుగా రైలు అనుసంధానం లభించింది. స్వాతంత్య్రం తర్వాత నాగాలాండ్‌కు తొలి రైల్వే స్టేషన్ వచ్చింది. గువాహటి ఎయిమ్స్ ఈశాన్య ప్రాంతంలో తొలి ఎయిమ్స్‌గా నిలిచింది. అసోంలోని సెమీకండక్టర్ కేంద్రం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షకు ప్రతీక. ఒకప్పుడు ప్రధానంగా భౌగోళికంగా మారుమూల ప్రాంతంగా భావించిన చోట భారత్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఒకటి ఆవిర్భవించగలదన్న ఆలోచనకు ఇది రూపమిస్తోంది.
‘చివరి గ్రామాల’ నుంచి ‘తొలి గ్రామాల’ వరకు
ఇదే మార్పు భారత సరిహద్దుల వెంబడి కూడా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మారుమూల జనావాసాలను సాధారణంగా దేశంలోని ‘చివరి గ్రామాలు’గా పేర్కొన్నారు. కానీ వైబ్రెంట్ విలేజెస్ కార్య క్రమం మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, అనుసంధానం, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవల ద్వారా ఈ ఆలోచనకు సంస్థాగత రూపం ఇస్తోంది. ఆకాంక్షిత జిల్లాల కార్య క్రమం ద్వారా ఇదే సూత్రం దేశ అంతర్భాగానికీ విస్తరించింది. చరిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలు శాశ్వతంగా వెనుకంజ లోనే ఉంటాయని అంగీకరించకుండా... ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేసేందుకు స్పష్టమైన ఫలితాలు, పథకాల సమన్వయం, పోటీతత్వ అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 బ్లాకు లను ‘ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం’ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఈ విధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లారు. గత దశాబ్దంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ 243 శాతం పెరిగింది. మొత్తం 75 ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలను పీఎం–జన్ మన్ పరిధిలోకి తీసుకొచ్చారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు, పీవీటీజీ ఆవాసాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సమన్వయ ప్రభుత్వ చర్యల ద్వారా పరిష్కరిస్తూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను అందులో భాగం చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. లీకేజీలను అరికట్టడం ద్వారా రూ. 5.14 లక్షల కోట్లకు పైగా మొత్తం ఆదాకు ఇది దోహదం చేసింది. సౌభాగ్య పథకం గ్రామీణ విద్యుదీకరణలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబా లకు స్వచ్ఛ వంట ఇంధనాన్ని అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విస్తరించింది.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే...
మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న అంశాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పరిష్కరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో పాల్గొనేందుకు ‘ముద్ర’ పథకం వీలు కల్పించింది. మొత్తం ముద్ర రుణాల్లో మహిళల వాటా 68 శాతం. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లోనూ మహిళలు 46 శాతం ఉన్నారు. గ్రామీణ పరివర్తనలో మహిళల ఆర్థిక సాధికారతకు లఖ్‌పతి దీదీ కార్యక్రమం కేంద్ర స్థానం కల్పిస్తోంది. విడివిడిగా చూస్తే ఈశాన్య ప్రాంతం, గిరిజన సమాజాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న పౌరులు వేర్వేరు సవాళ్లుగా కనిపిస్తారు. అన్నింటినీ కలిపి చూస్తే మోదీ ప్రభుత్వ పాలనా తత్వంలోని విస్తృత నిర్మాణం స్పష్టమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న వేళ కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ లేదా మరింత సమర్థమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటమే ఆకాంక్ష కాదు. భారత అభివృద్ధి గాథలో ఒకప్పుడు అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమాన భాగస్వామ్యం ఉండేలా చూడటం లక్ష్యం.
రామ్‌నాథ్ కోవింద్
వ్యాసకర్త భారత మాజీ రాష్ట్రపతి


