ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యమిత్రుడు శామళ్‌దాస్ మోదీ ప్రత్యేక లేఖ రాశారు. గుజరాత్‌లోని మెహసాణా జిల్లా వడనగర్‌కు చెందిన శామళ్‌దాస్.. చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ మోదీని ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా పేర్కొన్నారు. ప్రధాని జన్మదినం సెప్టెంబర్ 17న జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ రాశారు.
చిన్ననాటి నుంచి కొనసాగుతున్న తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్న శామళ్‌దాస్.. నరేంద్ర మోదీ జీవితంలో ఏది సాధించాలని నిర్ణయించుకున్నా దాన్ని పూర్తి చేసి చూపించారని లేఖలో పేర్కొన్నారు. తన మిత్రుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం, వడనగర్ అభివృద్ధి, ఆ నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకు జరిగిన పనులను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.
‘మీరు శ్రీకృష్ణుడు.. నేను మీ సుదాముడిని’
లేఖలో శామళ్‌దాస్ ప్రత్యేకంగా తమ బాల్య స్నేహాన్ని ప్రస్తావించారు. వడనగర్‌లో కలిసి గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ.. నరేంద్ర మోదీని తన ‘శ్రీకృష్ణుడు’గా, తనను ‘సుదాముడు’గా అభివర్ణించారు. కాలం మారినా చిన్ననాటి స్నేహం తనకు ఇప్పటికీ అంతే ప్రత్యేకమని పేర్కొన్నారు.
‘ఏది అనుకుంటే అది పూర్తి చేస్తారు’
మోదీ పని తీరును కూడా శామళ్‌దాస్ ప్రశంసించారు. ఆయన ఏదైనా సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసి చూపిస్తారని లేఖలో రాశారు. 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని ప్రస్తావిస్తూ మోదీని ‘నూతన భారత శిల్పి’గా అభివర్ణించారు. ఒకప్పుడు తనతో కలిసి ఉన్న బాల్యమిత్రుడు ఇప్పుడు దేశ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొంటూ.. ఆయన ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
వడనగర్ అభివృద్ధితో పాటు నగర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేయడంపై కూడా లేఖలో ప్రస్తావన ఉంది. వడనగర్ గుజరాత్‌లోని మెహసాణా జిల్లాలో ఉంది. మోదీ బాల్యం అక్కడే గడిచింది.
భారత్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా శామళ్‌దాస్ తన లేఖలో పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భారత్, నరేంద్ర మోదీ గురించి చర్చ జరుగుతోందని రాశారు. చివరగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.


