ఇక ఉచిత అన్నదానాలు, లంగర్లు, ఇఫ్తార్, పెళ్లివిందులపై నజర్
7 రోజుల ముందే అనుమతి తీసుకోవడం తప్పనిసరి
ప్రజారోగ్యం, భద్రత దృష్యా నిర్ణయం.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు
ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడి
ముంబై: నిన్న, మొన్నటి వరకు వివిధ హోటళ్లు, తినుబండరాలు, ఆహార పదార్ధాలు, స్వీట్లు, పాలు, పాలతో తయారయ్యే ఉత్పత్తులపై దాడులుచేసిన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్‌డీఏ) శాఖ అధికారులు ఇప్పుడు తమ పంథా మార్చుకున్నారు. ప్రజల ఆధ్వర్యంలో జరిగే వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. ఈమేరకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు, మహాప్రసాదాల పంపిణీ, లంగర్లు, పెళ్లి విందులపై నిఘా వేయనున్నట్లు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే (Tukaram Mundhe) తెలిపారు.
ఇకపై అన్ని కులాల, మతాల వారు నిర్వహించే సామూహిక అన్నదానం, ఇఫ్తార్ విందులు, లంగర్లు, వివాహ భోజనాలకు సంబంధించి ఏడు రోజుల ముందే ఎఫ్‌డీఏ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కఠినచర్యలు తప్పవని ముండే హెచ్చరించారు. తుకారం ముండే ఎఫ్‌డీఏ కమీషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీరించిన తరువాత కల్తీలపై దాడులు మరింత ఉధృతం చేశారు. ముంబైలో పేరుగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, బ్రాండెడ్ కంపెనీలపై దాడిచేసి వాటిని సీజ్ చేశారు. యజమానులపై చర్యలు తీసుకోవడమేగాకుండా లైసెన్స్, పర్మిట్లు రద్దు చేశారు. దీంతో అక్రమ, కల్తీ వ్యాపారుల్లో దడ మొదలైంది.
మఫ్టీలో హాజరు..రహస్యంగా తనిఖీలు
పండుగలు, ఉత్సవాల సమయంలో వివిధ కుల, మతాలవారు తమ నివాస సొసైటీలలో, టవర్ల, చాల్స్, భవనాల ఆవరణలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. దీంతోపాటు ముస్లిం సామాజిక వర్గంలో ఇఫ్తార్ విందులు, సిక్కులకు లంగర్లు, పెళ్లి భోజనాలు కూడా సాధారణం. త్వరలో గణేశోత్సవాలు, ఆ తరువాత నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి, క్రిస్మస్ తదితర ప్రధాన పండుగల నేపథ్యంలో వివిధ సంస్దలు అన్నదాన, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ముందస్తు సమాచారం మేరకు ఎఫ్‌డీఏ అధికారులు మఫ్టీలో ఆయా కార్యక్రమాలకు హాజరై రహస్యంగా తనిఖీలు నిర్వహిస్తారు. ఎఫ్‌డీఏ నియమాలను సరిగా అమలుచేస్తున్నారా..? లేదా..? అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తారని ముండే స్పష్టం చేశారు.
గోదాములు, ఫ్యాక్టరీలపై నిఘా..
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే అధికారం ఎవరికి లేదు. ఆహర పదార్ధాలలో ఎలాంటి కల్తీ ఉండకూడదు. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం లభించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిబంధనకు రూపకల్పన చేసినట్లు తుకారాం ముండే తెలిపారు. ఇందులో భాగంగా గోదాముల్లో నిల్వచేసిన సరుకులు, వాటిని ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలపై కూడా నిఘా వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆహార పదార్ధాలు విక్రయించే చిన్న క్యాంటీన్లు, తోపుడు బళ్లను కూడా తనిఖీ చేస్తారు. పాలు, పాలతో తయారయ్యే పనీర్, ఇతర ఉత్పత్తులు, ఐస్, మాంసాహారం, తాగు నీరు, స్వీట్లు, వంట నూనె, బేకరీ పదార్ధాల్లో కల్తీని గుర్తిస్తే సంబంధిత నిర్వాహకులు లేదా క్యాటరింగ్ యజమానులపై చర్యలు తప్పవని ముండే హెచ్చరించారు. బడా వ్యాపారులతోపాటు సార్వజనిక కార్యక్రమాల నిర్వాహకులను కూడా వదిలీ పెట్టేది లేదని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: మరో బాంబు పేల్చిన తుకారం ముండే
గ్రేడ్ల వారీగా ఉత్సవాల విభజన ఇలా..
గ్రేడ్ 1–గణేశోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళీ, ఈడ్, క్రిస్మస్, నూతన
సంవత్సరం.
గ్రేడ్ 2– మకర సంక్రాంతి, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, ఆషాడ ఏకాదశి శ్రావణ మాసం, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్టి ఉత్సవాలు, కోజాగిరి పూర్ణిమ, గురునానక్ జయంతి,
గ్రేడ్ 3–స్ధానిక జాతరలు, సంతలు, పల్లకీ పాద యాత్రలు, ఉర్సులు


