కోటీశ్వరుడైన అరుల్ తల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతడికి ఒక స్వామీజీ.. ‘నలభై ఎనిమిది రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా దీక్ష చేస్తే నీ తల్లి కోలుకుంటుంది’ అని సలహా ఇస్తాడు. స్వామిజీ సలహాను అనుసరించి నలభై ఎనిమిది రోజులు బిచ్చగాడిగా అవతారం ఎత్తి అష్టకష్టాలు పడతాడు అరుల్. అయితే ఇది ‘బిచ్చగాడు’ అనే సూపర్ హిట్ సినిమా కథ. ఇంచుమించు ఇలాంటి ఘటనే ముంబైలో జరిగి సంచలనం సృష్టించింది...
మహారాష్ట్రలోని అత్యంత సంపన్న శాసన సభ్యులలో పరాగ్ షా ఒకరు. ఈయన ఘాట్‌కోపర్ తూర్పు నియోకవర్గ శాసనసభ్యుడు, వ్యాపారవేత్త. జైన సంప్రదాయంలోని ఒక ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు ముంబైలోని ఘాట్‌కోపర్ వీధుల్లో ఒకరోజు బిచ్చగాడి వేషధారణలో గడిపాడు షా. దీని కోసం భద్రతా సిబ్బందిని దూరం పెట్టాడు. ఖరీదైన వస్తువులు, వాహనాలను విడిచి పెట్టాడు. ప్రజలు తనను గుర్తు పట్టకుండా ఉండడానికి ప్రత్యేకంగా మేకప్ వేసుకొని రోజంతా భిక్షాటన చేస్తూ గడిపాడు.
ఆ బీదలు దయాగుణ సంపన్నులు!
‘ సమోసాలు అమ్మే వ్యక్తి పేదవాడు అయినప్పటికీ ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా నాకు సమోసాలు ఇచ్చాడు. ముంబై నగరం ఎలాంటిదంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు’ అని ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకున్నాడు షా. కోటీశ్వరుడైన షా భిక్షాటన చేయడమే కాకుండా, రోడ్డు పక్కన కూర్చొని బిచ్చగాడిలాగే తిన్నాడు. ఆ తరువాత తన మేకప్‌ను తీసేసుకొని, తాను ఇంతకు ముందు వెళ్లిన వారి దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తులతో మాట్లాడాడు. కృతజ్ఞతలు తెలియజేశాడు. బిచ్చగాడిగా తన అనుభవాలను సన్నిహితులతో, గురువుతో పంచుకున్నాడు. రియల్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన షా మొదట కార్పొరేటర్‌గా గెలిచాడు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్–2024 కోసం సమర్పించిన అఫిడవిట్‌లో రూ.3,383 కోట్లకు పైగా విలువైన ఆస్తులు తనకు ఉన్నట్లు ప్రకటించాడు. తద్వారా రాష్ట్రంలో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇలా అందరూ చేస్తే!
బిచ్చగాడిగా షా వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘ఒక్క రోజో, రెండు రోజులో... ప్రతి ఒక్కరు బిచ్చగాడిగా మారితే మనకు కొత్త వెలుగు తప్పకుండా కనిపిస్తుంది’ అని ఒక నెటిజనుడు అభి్రపాయపడ్డాడు. ‘వాస్తవం’ అంటూ అతడితో చాలామంది ఏకీభవించారు.
జీవన వాస్తవం
‘ఈ అనుభవం నాకు జీవన వాస్తవికతను కళ్లకు కట్టింది. రోజూ కనిపించే గౌరవ మర్యాదలు లేవు. నన్ను కలవడానికి ప్రజలు క్యూ కడతారు. అదే ప్రజల దగ్గరికి నేను వెళ్లినప్పుడు వారు నా కంటే ఉన్నతమైన వారిగా, ఎక్కువ హోదా కలిగిన వారిగా కనిపించారు. అదే జీవనవాస్తవికత. ముంబై ప్రజలలోని సహజ దయాగుణం కూడా తెలిసింది’ అంటున్నాడు షా.ఒక వ్యక్తి షాకు ఇరవై రూపాయలు ఇచ్చి... ‘వెళ్లి భోజనం చెయ్ బాబా’ అన్నాడు. ఆ ఇరవై రూపాయలు తీసుకొని సమోసాలు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లాడు షా. ‘నా దగ్గర డబ్బులేవీ లేవు’ అని సమోసాలు అమ్మే వ్యక్తికి చె΄్పాడు. ఆయన విసుక్కోకుండా చిరునవ్వుతో సమోసాలు ఇచ్చాడు.


