విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం | Nagpur Ganeshotsav, Space Themed Ganesh Mandap Showcases The Link Between Science, Spirituality And The Human Mind | Sakshi
Sakshi News home page

విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం

Sep 16 2026 9:36 AM | Updated on Sep 16 2026 10:19 AM

Bappas Cosmic Science Themed Ganesh Pandal in Nagpur

నాగ్‌పుర్: ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానాన్ని మేళవిస్తూ మహారాష్ట్రలోని నాగపూర్‌లో గల బాల గణేశోత్సవ మండల్ ఈ ఏడాది  ‘విజ్ఞానం ద్వారా ఆత్మశుద్ధి’ ఇతివృత్తంతో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసింది. మనసు, చైతన్యం, విజ్ఞానం, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న అనుసంధానాన్ని భక్తులకు పరిచయం చేయడం దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ మండపాన్ని అంతరిక్షాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. గెలాక్సీలు, గ్రహాల స్ఫూర్తితో లోహాలు, రేఖాగణిత ఆకృతులు, వృత్తాకార నిర్మాణాలను ఉపయోగించి ఖగోళ అంశాలు, అవి మానవ జీవితంపై చూపే ప్రభావాన్ని ప్రతిబింబించారు.

ప్రవేశద్వారం వద్ద భక్తుల అవగాహనకు విశ్వానికి సంబంధించిన నమూనాలను  ఉంచారు. మానవ మెదడు పనిచేసే తీరును చూపించే ప్రతిరూపాలు, ఇన్‌స్టలేషన్లు ఇందులో ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ ద్వారా భక్తులు తమలోకి తాము చూసుకుని ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు కార్పొరేటర్, మండల్ అధ్యక్షుడు ఈశ్వర్ తెలిపారు. ప్రధాన మండపంలోకి వెళ్లిన తర్వాత  విశ్వాన్ని తలపించే ఏర్పాట్లు కనిపిస్తాయని, మానవ మెదడులో నిరంతరం జరిగే ఆలోచనలు, కార్యకలాపాలను గోడలపై ప్రతిబింబించామని ఈశ్వర్‌ వివరించారు. భావోద్వేగాలు, ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియలను కూడా ఇందులో చూపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ మండళ్లలో రూపొందించిన నమూనాలు, డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మండపాన్ని రూపొందించినట్లు చెప్పారు.

మండపం మధ్యలో మనసు, మేధస్సు, ఆలోచనలు, సంస్కృతికి ప్రతీకగా భారీ జలాశయాన్ని పోలిన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి వెలువడే తరంగాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు అంతర్గత శత్రువులను సూచిస్తాయి. మధ్యభాగం పైన భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మానవులలో మారుతూ ఉండే ఆలోచనలు, భావోద్వేగాలను వీక్షించే విశ్వశక్తికి ఇది ప్రతీకగా పేర్కొన్నారు. అదుపు లేని భావోద్వేగాలు, ప్రతికూల ధోరణులు.. మానసిక అశాంతి, ఘర్షణ, ద్వేషం, హింస, విధ్వంసానికి దారితీస్తాయని ఈశ్వర్‌ తెలిపారు. దీనికి భిన్నంగా గణేశుడికి శరణాగతి, ప్రార్థన, నైతిక విలువలు, సత్ప్రవర్తన, కరుణ ఆత్మశుద్ధికి మార్గాలుగా చూపించినట్లు చెప్పారు. అజ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు సాగే ప్రయాణానికి ప్రతీకగా 16 దీపస్తంభాలను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆడంబరాలకు దూరంగా.. వందేళ్ల 32 గణేశ మండపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement