మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడిపై ఈ రేంజ్‌లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆసుపత్రుల్లో సాధారణంగా వాడే వైద్య సామాగ్రి ధరలను సమీక్షించాలనికోరారు. ఇప్పటికే ఆహార భద్రత, నిబంధనలపై విస్త్రృత దాడులు, జరిమానాలు, రద్దు లాంటి చర్యలతో పలు రెస్టారెంట్ల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తుకారం ముండే మరో సంచలనానికి తెరలేపారు.
రిటైల్ అండ్ వాణిజ్య మార్కెట్లలో విక్రయించే వైద్య పరికరాల ధరల తీరును అంచనా వేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ప్రైస్ మానిటరింగ్ రిసోర్స్ యూనిట్ (MSPMRU) , ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ఒక సర్వేలో దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడైనాయి. ఆసుపత్రులలో వాడే వైద్య పరికరాలపై భారీ దోపిడీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కొనుగోలు ధరకు, గరిష్ట దరకు, MRPకి మధ్య వందల, వేల శాతాల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
ఈ సర్వే ప్రకారం కేవలం రూ. 11 విలువ చేసే ఐవీ సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారు. అంటే దీనిపై లాభం ఏకంగా 2,841శాతం. రూ. 6.75 ఖరీదు చేసే 10 మి.లీ. సిరంజీని రూ. 57.20కి అమ్ముతున్నారు (747శాతం ఎక్కువ). రూ. 40-45 ఖరీదు చేసే నెబ్యులైజర్ మాస్క్ (Nebulizer Mask) ధర రూ. 652 నుంచి రూ. 715 వరకు బిల్లు వేస్తున్నారు (సుమారు 1,687 శాతం అదనం). అంతేకాదు రూ. 29.41 కొనుగోలు ధర గల క్యాథెటర్ దాని అసలు ధర కంటే 10 రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కలు వాణిజ్య స్థాయిలో అదుపులేని లాభార్జన జరుగుతోందని అధికారులు పేర్కొనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: ఒరాకిల్‌ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం
ఈ భారీ ధరల పెరుగుదల అహేతుకమైనది, అన్యాయమైందీ అంటూ తుకారాం ముండే ఈ దోపిడీని తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు బేరాలాడే అవకాశం లేకపోవడంతో, ట్రేడింగ్ వర్గాలు దీనిని ఆసరాగా చేసుకుని విపరీతంగా లాభాలు గడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్స వినియోగ వస్తువులను (Surgical Consumables) డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013 పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!


