తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు! | Turkish Airlines Flight Hit by Severe Turbulence | Sakshi
Sakshi News home page

తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!

Sep 14 2026 9:05 AM | Updated on Sep 14 2026 9:11 AM

Turkish Airlines Flight Hit by Severe Turbulence

ఇస్తాంబుల్‌ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ప్రతికూల వాతావరణం కుదుపులకు గురిచేసింది. తుఫాను మధ్య విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ.. ప్రతిసారీ విఫలమైంది. చివరకు విమానాన్ని దారి మళ్లించి ట్యునిస్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని ఎన్‌ఫిదా-హమ్మమెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.  

తుఫానులో తీవ్ర కుదుపులు
ఇస్తాంబుల్‌ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న ఈ విమానంలోని ప్రయాణికులు తీవ్ర కుదుపులతో ఆందోళనకు గురయ్యారు. విమానం లోపల తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారు @mmaiskaya పంచుకున్నారు. అందులో ప్రయాణికులు భయంతో అరుస్తూ.. సీట్లను గట్టిగా పట్టుకున్నట్లు కనిపించింది. అయితే విమానం  సురక్షితంగానే ఉందని ఆమె పేర్కొన్నారు.

మూడు సార్లు ల్యాండింగ్‌ యత్నం
విమానం దిగేందుకు ప్రయత్నించిన సమయంలో సమస్యలు తీవ్రంగా మారాయి. తుఫాను కొనసాగుతున్నప్పటికీ పైలట్‌ విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ మూడు సార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే ప్రతిసారీ సురక్షితంగా దిగడం సాధ్యపడలేదు. ఈ క్రమంలో విమానం తీవ్ర కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు.

మూడో ప్రయత్నంలో మరింత భయం
మూడోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కిందికి పడిపోతున్నట్లు అనిపించిందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. ‘ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ విమానం దిగడం ప్రారంభించిన వెంటనే పరిస్థితి భయానకంగా మారింది. నా జీవితంలో ఇంతగా ప్రాణభయం ఎప్పుడూ కలగలేదు. నా తల్లి కూడా నాతోనే ఉన్నారు’ అని ఆమె తెలిపారు.

సురక్షితంగా ప్రత్యామ్నాయ విమానాశ్రయంలో..
తుఫాను, తీవ్ర కుదుపుల నేపథ్యంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ట్యునిస్‌-కార్తేజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించలేకపోయారు. దీంతో దాన్ని ఎన్‌ఫిదా-హమ్మమెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్‌: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement