హర్ముజ్‌ సంక్షోభంలో బిగ్‌ ట్విస్ట్‌.. అనూహ్య పరిణామాలు! | Twist Hormuz Crisis: RedSea BabelMandeb Tensions Raise Global Oil Fears | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌ సంక్షోభంలో బిగ్‌ ట్విస్ట్‌.. అనూహ్య పరిణామాలు!

Sep 14 2026 8:02 AM | Updated on Sep 14 2026 8:27 AM

Twist Hormuz Crisis: RedSea BabelMandeb Tensions Raise Global Oil Fears

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హర్ముజ్‌ జలసంధి సంక్షోభం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే దిగ్భందనాలు, సముద్ర రవాణాపై ఆంక్షలు, నౌకలపై దాడులు, చమురు సరఫరాకు అంతరాయాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. మరోవైపు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా అనిశ్చితి నెలకొంది. సమస్యను చర్చల ద్వారా చక్కదిద్దేందుకు కీలకమైన సమావేశం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 

హర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలు, భద్రత, భవిష్యత్‌ నిర్వహణపై ఇరాన్‌, గల్ఫ్‌ దేశాల మధ్య ఒమన్‌లో సోమవారం కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు ఒమన్‌ విదేశాంగ మంత్రి బదర్‌ అల్‌ బుసైదీ ప్రకటించారు. ప్రాంతీయ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటు ఇరాన్‌ కూడా సమావేశం వాయిదా పడిన విషయాన్ని ధ్రువీకరించింది. కొన్ని దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒమన్‌తో సమన్వయం చేసుకుని తదుపరి తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.తద్వారా.. హర్ముజ్‌పై ఒక తాత్కాలిక అవగాహనకు రావాల్సిన సమయంలోనే దౌత్య ప్రక్రియకు బ్రేక్‌ పడినట్టయింది. 

అసలు సమస్య ఇదే..
హర్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్‌ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్‌, ఒమన్‌ మధ్య హర్ముజ్‌లో రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చే మార్గాలపై ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. ఇప్పుడు గల్ఫ్‌ దేశాలను కూడా భాగస్వామ్యం చేసి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఇరాన్‌ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అమెరికా తమపై దాడులు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు కొనసాగిస్తున్నంతకాలం జలసంధిలో రాకపోకలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. అంటే.. గల్ఫ్‌ దేశాలతో ఇరాన్‌ ఒక అవగాహనకు వచ్చినా, అమెరికా–ఇరాన్‌ మధ్య ప్రధాన వివాదం పరిష్కారం కాకపోతే హర్ముజ్‌లో పూర్తి స్థాయిలో రాకపోకలు పునరుద్ధరించడం కష్టమే. అందుకే ఇప్పుడు గల్ఫ్‌ దేశాలతో జరిగే చర్చలతోపాటు అమెరికా–ఇరాన్‌ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కూడా కీలకంగా మారింది.

నౌకపై దాడితో మరింత టెన్షన్‌
ఈ దౌత్య ప్రయత్నాలకు సమాంతరంగానే హర్ముజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఓ వాణిజ్య నౌకను ప్రాజెక్టైల్‌ తాకడంతో మంటలు చెలరేగాయి. సిబ్బందిని నౌక నుంచి తరలించాల్సి వచ్చింది. ఇరాన్‌ అధికారిక వర్గాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దీంతో కీలక సముద్ర మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.

హర్ముజ్‌లో రాకపోకలు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ జలసంధిపై ఏ చిన్న పరిణామం జరిగినా అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

సౌదీ పైప్‌లైన్‌పైనా దాడి
హర్ముజ్‌ సంక్షోభానికి తోడు సౌదీ అరేబియాలోని కీలక చమురు మౌలిక సదుపాయాలపైనా దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తూర్పు ప్రాంతాల నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యన్బుకు చమురును తరలించే ఈస్ట్‌–వెస్ట్‌ పైప్‌లైన్‌పై డ్రోన్‌ దాడులు జరిగాయి. దీంతో ఆ మార్గంలో చమురు సరఫరా నిలిచిపోయింది.

హర్ముజ్‌ ద్వారా రవాణా దెబ్బతిన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే ఈ పైప్‌లైన్‌ కూడా పనిచేయకపోవడం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఇప్పటికే హర్ముజ్‌ ఎఫెక్ట్‌తో రోజుకు మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా దెబ్బతినగా.. సౌదీ పైప్‌లైన్‌ మూసివేతతో ప్రపంచ సరఫరాపై మరింత ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది.

బాబ్‌ అల్‌ మాండెబ్‌లోనూ మంటలు
మరోవైపు హర్ముజ్‌కు మరో కీలక ప్రత్యామ్నాయ సముద్ర మార్గమైన(ఎర్ర సముద్రం-Red Sea) బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియాపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన రెండు మార్గాలపైనా ఒకేసారి భద్రతా ముప్పు నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా అమెరికా సాయం కోరినట్లు సమాచారం. హౌతీల పురోగతిని అడ్డుకోవడంలో అమెరికా మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి ప్రస్తుతానికి నిఘా సమాచార సహకారానికే పరిమితమైన స్పందన కనిపిస్తోంది.

ట్రంప్‌కు కొత్త చిక్కులు
హర్ముజ్‌ జలసంధి మూసివేత, నౌకలపై వరుస దాడులు, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, బాబ్‌ అల్‌ మాండెబ్‌ వద్ద హౌతీల దూకుడు.. ఇలా సంక్షోభం ఒక్క హార్ముజ్‌కే పరిమితం కాకుండా ప్రాంతంలోని కీలక ఇంధన మార్గాలన్నింటికీ విస్తరిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని, ఇరాన్‌ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్‌ చెబుతున్నారు. యుద్ధం ముగిసిన వెంటనే ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ట్రంప్‌ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. హర్ముజ్‌పై దౌత్య ప్రయత్నాలు వాయిదా పడటం, సముద్ర మార్గాల్లో నౌకలపై దాడులు కొనసాగడం, సౌదీ చమురు రవాణా మార్గానికి దెబ్బ తగలడం, మరోవైపు బాబ్‌ అల్‌ మాండెబ్‌ వద్ద హౌతీల పట్టు పెరగడం.. యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న అమెరికా ప్రయత్నాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. పైగా సౌదీ అరేబియా హౌతీలను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక సాయం కోరగా.. ఇప్పటివరకు వాషింగ్టన్‌ నిఘా సమాచార సహాయానికే పరిమితమైంది. దీంతో ఒకవైపు యుద్ధం ముగుస్తుందని ట్రంప్‌ చెబుతున్నా.. మరోవైపు సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 

రాకెట్‌లా చమురు ధరలు
హర్ముజ్‌ సంక్షోభం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాదు. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ ప్రాంతంలోని సముద్ర మార్గాలపై ఆధారపడి ఉంటుంది. సరఫరాకు అంతరాయం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి.. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. తాజా దాడులు, హర్ముజ్‌ చర్చల వాయిదాతో మార్కెట్లలో సరఫరా భయాలు మరింత పెరిగాయి. 

అందుకే ఇప్పుడు అందరి చూపూ హర్ముజ్‌పైనే. జలసంధిలో రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి? ఇరాన్‌, గల్ఫ్‌ దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు ఎప్పుడు మళ్లీ మొదలవుతాయి? అమెరికా–ఇరాన్‌ మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుంది? అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం చర్చలకు బ్రేక్‌ పడటంతో హర్ముజ్‌ సంక్షోభం మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 45 వేల కోట్లు ఉంటేనే మళ్లీ మాములు స్థితికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement