22 ఏళ్ల తరువాత ఆ తల్లి ఒడి మళ్లీ నిండింది!  | Greek woman has IVF birth from 22-year-old embryo | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తరువాత ఆ తల్లి ఒడి మళ్లీ నిండింది! 

Sep 14 2026 5:34 AM | Updated on Sep 14 2026 5:34 AM

Greek woman has IVF birth from 22-year-old embryo

ఎప్పుడో 22 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన అండం మళ్లీ ఊపిరి పోసుకుంది...  
యాభై మూడేళ్ల వయసులో 21 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లి కడుపులో జీవమైంది! 
రోడ్డు ప్రమాదంతో మరణించిన కొడుకు లోటును భర్తీ చేస్తూ... ఆ ఇల్లు మళ్లీ ముద్దు మురిపాలతో నిండిపోయింది. 
గ్రీకు దేశపు ఈ టెక్నాలజీ అద్భుతం ఎలా ఆవిష్కృతమైందంటే... 

ఏథెన్స్‌: కాన్‌స్టాంటినో రప్తీస్, క్రిస్టీనా రప్తీ జెలెపీలు గ్రీసు రాజధాని ఏథెన్స్‌ వాసులు. భర్త వయసు 60, భార్యకేమో 54. ఏడాది క్రితం 2025 అక్టోబరులో వీరిద్దరి ఒక్కగానొక్క కొడుకు 21 ఏళ్ల జార్జ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఎలాగోలా వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ్డారు కానీ.. బోసిపోయిన ఇల్లు మాత్రం వారిని రోజూ వెక్కిరిస్తూనే ఉండింది. 

వారసుల్లేకుండా పోతారేమో అన్న బెంగ కూడా వారిని బాధించింది. ఈ నేపథ్యంలోనే క్రిస్టీనా రప్తీ జెలెపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2004లో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కన్నప్పుడే భద్రపరచిన అండాల సాయంతో మళ్లీ బిడ్డను కనాలని నిర్ణయించింది. అయితే అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై నాలుగేళ్లు దాటితే కృత్రిమ గర్భధారణతో బిడ్డను కనడం సాధ్యం కాదు. దాంతో అప్పటికప్పుడు కొడుకు పోయిన బాధను కూడా పక్కనబెట్టి క్రిస్టీనా, భర్త కాన్‌స్టాంటినో రప్తీస్‌లు మరోసారి కృత్రిమ గర్భధారణకు సిద్ధమయ్యారు. 

భద్రపరచిన అండాన్ని ఫలదీకరణం చేయించి 2025 డిసెంబరులో పిండాన్ని అభివృద్ధి చేసి గర్భంలోకి ప్రవేశపెట్టారు. నెలలు గడిచాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది... చివరకు నెలలు నిండిన తరువాత 4 రోజుల క్రితం ఏథెన్స్‌లోని ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిప్పుడు ఆ చిన్నారి బరువు 3.49 కిలోలు!!! 

ఇరవై రెండేళ్ల ఐదు నెలల, 23 రోజులపాటు గడ్డకట్టి ఉన్న అండం నుంచి సరికొత్త జీవం ఉనికిలోకి రావడం వైద్య చరిత్రలో ఇదే రెండోసారి మాత్రమే. గత ఏడాది అమెరికాలోని ఓహాయోకు చెందిన దంపతులు 30 ఏళ్ల క్రితం శీతలీకరించిన అండం సాయంతో బిడ్డను కని గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. గతంలో 18 ఏళ్ల క్రయో ప్రిజర్వేషన్‌ తరువాత జపాన్‌లో, 17 ఏళ్ల తరువాత ఇజ్రాయెల్‌లోనూ పిల్లలు జీవంతంగా పుట్టిన రికార్డులు ఉన్నాయి.  

‘‘కొడుకు పోయిన తరువాత ఇంకో బిడ్డను కనాలి అనుకున్నప్పుడు సమయం సరిపోతుందా? అన్న అనుమానం ఉండింది. 54 ఏళ్లు నిండేలోపు కృత్రిమ గర్భదారణకు సంబంధించిన ప్రక్రియలు అన్నీ ముగియాలన్నది ప్రభుత్వ నిబంధన. దీనికి ప్రభుత్వ అనుమతులు పొందాలి కూడా.’’అని క్రిస్టీనా రప్తీ జెలెపీ బిడ్డను కన్న తరువాత తెలిపారు. 

కాలంతో పోటీపడుతూ మరోసారి తల్లినయ్యానని, వైద్యబృందం ఇచ్చిన స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేసింది. ‘‘జీవితానికి రెండో ఛాన్స్‌ ఇద్దామని అనుకున్నాం. ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని తీర్మానించుకున్నాం. మా జీవితాల్లోకి ఇంకో కొత్త జీవితాన్ని ఆహ్వానించాం. కుటుంబం కొనసాగాలన్నదే సంకల్పం’’అని రప్తీ తెలిపారు. ‘‘కూతురు ఆరోగ్యంగా, ఆనందంగా పెద్దదయితే చాలు. జార్జ్‌ మాదిరిగానే మా ఇంటిని నవ్వులతో నింపాలి’’అని ఆకాంక్షించారు. అమ్మాయి పేరేంటో తెలుసా? అన్న జార్జ్‌ను గుర్తు చేసేలా జార్జియా అని పెట్టుకున్నారు.  

గ్రీస్‌లో బర్త్‌రేట్‌ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 54 ఏళ్ల నిబంధనను సమీక్షించాలని రప్తీ జలెపి వైద్యులైన డాక్టర్‌ కోస్టాస్‌ పాంటోస్‌ తెలిపారు. యాభై నాలుగేళ్లకు ఒక్కరోజు ఎక్కువైనా బిడ్డను కనడాన్ని అనుమతించడం లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. బిడ్డను కనడం తల్లిదండ్రుల హక్కని, ప్రభుత్వం దాన్ని లాక్కోరాదని అభిప్రాయపడ్డారు. రెండోసారి తండ్రి అయిన కాన్‌స్టాంటిన్‌ రప్తీస్‌ మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇంకో దేశానికి వెళ్లి మూడో బిడ్డను కంటామేమో అనడం కొసమెరుపు!!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement