రక్తమోడిన రహదారులు | Road accident in Vizianagaram district | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

Sep 14 2026 4:01 AM | Updated on Sep 14 2026 4:01 AM

Road accident in Vizianagaram district

ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురి దుర్మరణం 

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం 

దత్తిరాజేరు: విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలోని షికారుగంజి కూడలి వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ బూర్జవలస పోలీసుల కథనం ప్రకారం.. రామభద్రపురం నుంచి గజపతినగరం వైపు వస్తున్న లారీ విజయనగరం నుంచి బాడంగి మండలం గజరాయునివలస వస్తున్న ఆటోను షికారుగంజి కూడలి వద్ద బలంగా ఢీకొంది. 

ఈ ప్రమాదంలో గజరాయునివలసకు చెందిన ఆటో డ్రైవర్‌ గుణుపూరి తిరుపతి(40), అదే గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ(50), పెదమానాపురం గ్రామానికి చెందిన గుడ్ల రాము(40) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను 108లో గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. 
ఎస్‌ బూర్జవలస ఎస్‌ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అగనంపూడి (విశాఖ): అతివేగంతో ఓ టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన విశాఖలోని దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ సమీప ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సామర్లకోట ప్రాంతానికి చెందిన పెట్టా రవికుమార్‌(46) అచ్యుతాపురం మండలం బ్రాండెక్స్‌ సెజ్‌ సమీపంలోని దుప్తూరులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తూ శ్రీనగర్‌లో నివాసముంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం వీటీసీ కట్రవులపల్లికి చెందిన రవి మేనకోడలి కుమారుడు పడాల సుధా వెంకట్‌ ఐటీఐ పూర్తి చేసి ఉపాధి కోసం మూడు రోజుల క్రితం రవి ఇంటికి వచ్చాడు. 

ఆదివారం ఉదయం కూర్మన్నపాలెంలో తన స్నేహితుడు ఓ ఉద్యోగంలో చేరేందుకు రావాలని చెప్పడంతో రవి తన ద్విచక్రవాహనంపై వెంకట్‌ను తీసుకుని బయల్దేరారు. దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ దాటిన తర్వాత ఆర్టీసీ డిపో ఎదురుగా వెనుక నుంచి వస్తున్న టిప్పర్‌ వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 
ఈ ప్రమాదంలో రవి, వెంకట్‌ అక్కడికక్కడే మృతి చెందారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రిల్లింగ్‌ ట్రాక్టర్‌ బోల్తా .. ఇద్దరి మృత్యువాత

మరో వ్యక్తికి స్వల్పగాయాలు.. బ్రేకులు పట్టేయడంతో ప్రమాదం
అనకాపల్లి: క్వారీ లోయలోకి డ్రిల్లింగ్‌ యంత్రంతో కూడిన ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అనకాపల్లి మండలం మాకవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... ఎస్‌జీఎక్స్‌ మినరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్వారీలో డ్రిల్లింగ్‌ పనులు చేసేందుకు రోజులాగే ఆదివారం తెల్లవారుజామున డ్రిల్లింగ్‌ యంత్రంతో కూడిన ట్రాక్టర్‌తో అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన తుమ్మపాల నాగేశ్వరరావు(37), మాకవరంలో స్థిరపడిన ఒడిశా రాష్ట్రం బలంగీర్‌ జిల్లా గుశ్రామ్‌ముడకు చెందిన మాధవ్‌ ప్రధాని(32), తుమ్మపాలకు చెందిన రమేష్‌ బయలుదేరారు. ట్రాక్టర్‌ కొండ ఎక్కుతున్న సమయంలో బ్రేకులు పట్టేశాయి. దీంతో ట్రాక్టర్‌ దిగువకు జారిపోయి లోయలోకి బోల్తాపడింది. ట్రాక్టర్‌తో సహా కింద పడిన నాగేశ్వరరావు, మాధవ్‌ ప్రధాని శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌పై నుంచి దూకేయడంతో రమేష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.  

మృతుల్లో  తుమ్మపాల నాగేశ్వరరావుకు భార్య లక్ష్మీ భవాని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాధవ్‌ ప్రధానికి భార్య  కుమారి, ముగ్గురు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్‌ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎనీ్టఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని, తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ సీఐ అశోక్‌ కుమార్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement