ఎక్కించిన మందు ఏంటో చెప్పండి | Death due to medical negligence: Protest at Kakinada GGH | Sakshi
Sakshi News home page

ఎక్కించిన మందు ఏంటో చెప్పండి

Sep 14 2026 3:49 AM | Updated on Sep 14 2026 3:49 AM

Death due to medical negligence: Protest at Kakinada GGH

జీజీహెచ్‌లో నిరసన తెలుపుతున్నమృతుడి కుమార్తెలు, భార్య, బంధువులు

మందు ఇచ్చిన డాక్టర్‌ని పిలిపించండి 

మా వాడిని మంచం మీద పడేయండన్న డాక్టర్‌ ఎక్కడ?

వారిద్దరినీ ఎందుకు తప్పిస్తున్నారు 

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన శ్రీను కుటుంబ సభ్యుల ఆవేదన 

కాకినాడ జీజీహెచ్‌ వద్ద నిరసన

కాకినాడ క్రైం: ‘ఎవరు చనిపోయినా కారణం ఏంటో తెలుçస్తుంది. మా దుస్థితి ఎవరికీ రాకూడదు. కనీసం నా భర్త ఎలా చనిపోయాడో తెలియకుండా కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు దాచి పెడుతున్నారు. ఎలా చనిపోయాడని ఎవరైనా అడిగితే ఏమో అనాల్సి వస్తోంది. చావుకి కారణం తెలియకపోవడం, చనిపోవడం కంటే పెద్ద బాధ. ఓ వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల మా కుటుంబం రోడ్డున పడింది. చేసిన తప్పునకు శిక్ష పడనివ్వండి. ఆమెను దాచి మా కుటుంబం ఉసురుపోసుకోవద్దు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. మా కుటుంబాన్ని ఆదుకోండి’.. ఇదీ కాకినాడ జీజీహెచ్‌లో పీజీ వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కోల్పోయిన కడగల శ్రీను భార్య ఉమ, కుటుంబ సభ్యుల ఆవేదన. 

అసలేం జరిగిందంటే... 
కాకినాడ జగన్నాథపురానికి చెందిన కడగల శ్రీను (43) ఆటో డ్రైవర్‌. కొద్ది రోజుల క్రితం ఆయనకు కుడివైపు మెడ భాగంలో ఓ కణితి వచ్చింది. స్థానిక వైద్యులు పరీక్షించి లైపోమా నెక్‌ (మెడ భాగంలో కొవ్వు కణతి)గా నిర్ధారించారు. ప్రాణాలకు ప్రమాదం లేదని, ఓ చిన్న శస్త్రచికిత్సతో తొలగిస్తారని చెప్పారు. కాకినాడ జీజీహెచ్‌లో సర్జరీకి సిద్ధం చేస్తుండగా కడగల శ్రీను ప్రాణాలు కోల్పోయారు. అతని కుటుంబం, బంధువులు ఆస్పత్రి వద్ద ఆదివారం నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

శ్రీను చనిపోయిన ఓటీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఎస్‌ఐసీయూ ఆవరణలో తమకు న్యాయం చేయాలని, శ్రీను మరణానికి కారణమైన పీజీ వైద్యురాలు పసుపులేటి మమతను, చికిత్సలో ఉండగా దుర్భాషలాడిన డ్యూటీ డాక్టర్‌ను తీసుకొచ్చి తమ ముందే నిలదీసి, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు. చనిపోయిన మనిíÙని ఎలాగూ తేలేరు. కనీసం తన భర్తకు ఏ మందు ఎక్కించడం వల్ల చనిపోయాడో అదైనా చెప్పండని వైద్యాధికారుల ఎదుట చేతులు జోడిస్తూ మృతుడి భార్య ఉమా కన్నీటి పర్యంతమయ్యారు.

 తన భర్తకు డిస్టిల్డ్‌ వాటర్‌కు బదులుగా ప్రమాదకర మత్తు మందు ఎక్కించారని వైద్యులకు తెలిసినా, విచారణ పేరుతో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తూ తమని మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధురాలినైన తనతో పాటు తన కోడలు, మనమరాలు దిక్కులేని స్థితిలో మిగిలిపోయామని రోదిస్తూ కన్నీళ్లతో మృతుడి తల్లి కుమారి అధికారుల కాళ్లు పట్టుకుని బతిమాలిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అనంతరం అక్కడి నుంచి బాధిత కుటుంబీకులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ వద్దకు తీసుకెళ్లారు. లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. విచారణ కొనసాగుతుందని,  వివరణ కోసం పిలుస్తామని ఆయన అన్నా­రు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కుటుంబ పరిస్థితిని కలెక్టర్‌కు వివరించి ఆదుకోవా­లని సిఫార్సు చేస్తానని సూపరింటెండెంట్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement