ఉద్యోగుల నుంచి అక్రమంగా వసూళ్లు..
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఎల్‌నినో పేరుతో సీఎం చంద్రబాబు రైతుల నోట్లో మట్టి కొట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇదే తరహా వాతావరణం ఉన్నా అక్కడ 93 శాతం భూములు సాగవుతున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు పంటలకు నీళ్లందించే విషయంపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. తక్షణమే కొత్త రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులు పంటలు సాగుచేసుకోవాలని సూచించిన నాయకులు.. ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని అవగాహన కల్పించేవారు కరువయ్యారన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సుమారు రూ.2.25 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటిన జీతాలు పెంచి జూలై ఒకటిన వారి నుంచి తిరిగి తీసుకున్నారన్నారు.
కొడవలి కొండపై ‘కేజీఎఫ్’ మాదిరిగా మైనింగ్..
గొల్లప్రోలు మండలంలోని కొడవలి కొండపై ‘కేజీఎఫ్’ సినిమా మాదిరిగా మైనింగ్ నిర్వహిస్తున్నారని, దాన్ని ఆపాలని నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన బౌద్ధవులు నిరసన చేపట్టిన విషయాన్ని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పరువు పోయిందన్నారు. పిఠాపురంలో కాకినాడ అభివృద్ధి ఆధారిత సంస్థ (కౌడ) నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా రూ.5 లక్షల లోపు పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారన్నారు. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలోను, డీసీసీబీ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ అక్రమాల విషయం పవన్ కళ్యాణ్‌కు తెలిసిందా లేదా తెలిస్తే ఎందుకు మిన్నకుండిపోయారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అక్రమాల వెనుక ఎవరున్నారో విచారణ చేయాలన్నారు.
తుమ్మల బాబుపై చర్యలు తీసుకోవాలి..
పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు మాట్లాడుతూ డీసీసీబీ ఉద్యోగులను భయపెట్టి వారి జీతాలు పెంచి రూ.2.25 కోట్లు కాజేసిన తుమ్మల బాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. పదోన్నతులు కల్పిస్తానంటూ ఉద్యోగుల వద్ద కూడా భారీగా నగదు కాజేసినట్టు చెప్పారు. జూలై ఒకటో తేదీన అనపర్తి, రఘుదేవపురం, మురమళ్ళ, ప్రత్తిపాడు డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ అధికారులు మిగిలిన బ్యాంకుల వారి వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను అధ్యక్షుడు బాబుకు నగదు రూపంలో అందించారన్నారు. ఇది నిజం కాకపోతే జూలై ఒకటో తేదీ సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను బయటపెట్టాలని దవులూరి డిమాండ్ చేశారు. డీసీసీబీ బ్యాంక్, కౌడ అక్రమాలు, కొడవలి అక్రమ మైనింగ్‌పై తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు.
ఇప్పటికే సహకార బ్యాంకు రూ.375 కోట్ల అప్పుల్లో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంచొద్దని ఆప్కాబ్, సహకార శాఖ కమిషనర్‌లు చెప్పారని దొరబాబు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ జీతాలు పెంచినట్టే పెంచి మళ్లీ వారి దగ్గర నుంచి అక్రమంగా కాజేశారన్నారు. తమ వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు తమ నియోజకవర్గంలో పలువురు సహకార ఉద్యోగులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బుల విషయం పవన్‌కు తెలియజేయాలని తనను కోరినట్టు చెప్పారు. తుమ్మల బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అన్నారు. వరుసకు చెల్లి అయిన మహిళ నుంచి అక్రమంగా భూమి లాక్కొని ఇబ్బంది పెడుతున్నారన్నారు. బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని కౌడలో పనులు చేయకుండా డబ్బులు కాజేసిన ఘనత ఈ తుమ్మల బాబుకు దక్కుతుందన్నారు. నిజంగా ఎటువంటి అవినీతికీ పాల్పడకుంటే తుమ్మల బాబు సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టి తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదో ఆర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వర్ధినీడి సుజాత, జమ్మలమడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
డీసీసీబీలోనూ కౌడలో
భారీ ఎత్తున అక్రమాలు
జిల్లా మంత్రి పవన్ కలుగజేసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా డిమాండ్


