నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రెడ్‌క్రాస్ వాత్సల్య వృద్ధాశ్రమం నిర్మాణంలో ఉన్న రెడ్‌క్రాస్ క్యాన్సర్ బ్లాక్, రంగరాయ వైద్య కళాశాల డిజిటల్ మూల్యాంకన భవన నిర్మాణాలకు, వివిధ సంస్థల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.1.50 కోట్ల నిధులు విరాళంగా అందించిన కరుటూరి చక్రవర్తిని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదివారం అభినందించారు. దాత చక్రవర్తి కాకినాడ వాసి కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. భవన నిర్మాణాలకు నిధులు సమకూర్చిన తరువాత మొదటిసారి కాకినాడకు విచ్చేసిన ఆయన రెడ్‌క్రాస్ జిల్లా, రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావుతో కలసి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన్ని సత్కరించి, భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
కాకినాడ అభివృద్ధికి ప్రణాళిక
మంత్రి నారాయణ
కాకినాడ లీగల్: కాకినాడ నగర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆదివారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక అభివృద్ధి, ప్రాజెక్టులపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


