చెన్నై: తమిళనాడులో మరోసారి అధికార టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణం విషయం రాజకీయ రగడకు కారణమవుతోంది. చెన్నైలోని పటినపాక్కంలో 25.55 ఎకరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును డీఎంకే వ్యతిరేకించింది. అక్కడ సచివాలయం నిర్మిస్తే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆ పార్టీ ఎంపీ విల్సన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పారు.
అయితే కొత్త స్థలం కోసం వెతకడం కంటే.. ఇప్పటికే ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్నే తిరిగి సచివాలయంగా మార్చాలని డీఎంకే సూచిస్తోంది. మాజీ సీఎం ఎం. కరుణానిధి హయాంలో ఈ భవనాన్ని సచివాలయం కోసమే నిర్మించారని, పెద్దగా మార్పులు చేయకుండానే చిన్నపాటి మరమ్మతులతో తిరిగి ఉపయోగించుకోవచ్చని విల్సన్ పేర్కొన్నారు. కరుణానిధి ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని అనంతరం జయలలిత ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చింది.
12 గ్రామాల ఆందోళన..
మరోవైపు పటినపాక్కంలో ప్రతిపాదిత నిర్మాణంపై స్థానిక మత్స్యకారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమీపంలోని 12 మత్స్యకార గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పడవలు నిలపడం, వలలు బాగుచేయడం, చేపలు ఆరబెట్టడం, మార్కెట్లు నిర్వహించడం కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయ నిర్మాణం జరిగితే సముద్రానికి తమ రాకపోకలు పరిమితం కావడంతో పాటు భవిష్యత్తులో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై డీఎంకే మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం పనులను నిలిపివేసి, స్థల ఎంపికపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీరప్రాంత పర్యావరణం, వరదలు, తుపాన్ల ముప్పును ప్రస్తావించారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా కొత్త సచివాలయం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. చెన్నై వెలుపల ప్రత్యేక పరిపాలనా నగరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
దీంతో రూ.1,200 కోట్ల కొత్త సచివాలయ ప్రాజెక్టు ఇప్పుడు స్థల వివాదంలో చిక్కుకుంది. మత్స్యకారుల అభ్యంతరాలు, ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం పటినపాక్కం ప్రతిపాదనపైనే ముందుకెళ్తుందా? లేక ఇప్పటికే ఉన్న ఓమందూరార్ భవనాన్ని తిరిగి సచివాలయంగా మార్చే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: తన డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం


