చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఎంకే స్టాలిన్ దవడ గాయాన్ని సీఎం విజయ్ ఎగతాళి చేశారంటూ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పెద్ద విలన్” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే నేతల కంటే తీవ్రంగా స్పందించిన దినకరన్.. విజయ్‌ను స్వార్థపరుడిగా అభివర్ణించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేస్తారంటూ మండిపడ్డారు.
విజయ్ పార్టీ టీవీకే అధికారంలో వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయ వాతావరణం వ్యక్తిగత విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. నటి త్రిషతో విజయ్‌కు ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించగా.. ముఖ్యమంత్రి మాత్రం డీఎంకే చీఫ్‌కు 1976లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తగిలిన దవడ గాయాన్ని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ సైగ.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్‌ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయ్‌పై విమర్శలు గుప్పించిన ఎంకే స్టాలిన్.. అదే సమయంలో తన దవడకు గాయం ఎలా జరిగిందో వివరించారు. 1975-77 మధ్య అమలైన ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయిన తర్వాత 1976లో తాను అరెస్టయిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. జైలులో మేము ఎన్నో రకాల వేధింపులు ఎదుర్కొన్నాం. మమ్మల్ని కుష్ఠు రోగులతో కలిసి ఉంచారు. పది మందిని ఒక చిన్న గదిలో బంధించారు. ఆ గదిలో ఒకే ఒక మూత్రశాల ఉండేది. చుట్టూ దుర్వాసన ఉన్నప్పటికీ అక్కడే నిద్రించాల్సి వచ్చేదంటూ స్టాలిన్ తెలిపారు.
పోలీసులు రాత్రిళ్లు మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. లాఠీలతో కొట్టేవారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలతో కూడా మమ్మల్ని కొట్టించారు. నాతో పాటు జైలులో ఉన్న ఎంపీ చిట్టిబాబు అక్కడే మరణించారు. ఆ దాడిలో నా దవడ ఎముక విరిగింది” అని చెప్పారు. విజయ్ తాను ఆ హావభావం చేయలేదన్న వివరణను స్టాలిన్ తోసిపుచ్చారు.
ఇదీ చదవండి: తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం


