TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్ | CM Vijay Son Jason Sanjay reacts to rumors of a rift with his father | Sakshi
Sakshi News home page

TVK నినాదాలతో దద్దరిల్లిన ‘సిగ్మా’ ఈవెంట్.. సీఎం విజయ్ తనయుడి రియాక్షన్

Sep 9 2026 11:08 PM | Updated on Sep 10 2026 12:14 AM

CM Vijay Son Jason Sanjay reacts to rumors of a rift with his father

తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక తమిళనాడులోని సేలంలో ఘనంగా జరిగింది. తెలుగు నటుడు సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈవెంట్‌లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నినాదాలతో హోరెత్తించారు. 'మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సంజయ్ అనగానే అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. దీంతో కాసేపు ప్రసంగాన్ని ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ స్పందించారు.

కొంతకాలం క్రితం సీఎం విజయ్, సంజయ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలో యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన ‘తిరుమలై’ తాను థియేటర్‌లో చూసిన తొలి సినిమా అని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తనకు 3 ఏళ్ళు అని చెప్తూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారుతున్న విషయం మొదటగా తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సైతం విజయ్‌ను తమ సినిమాకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. దానికి సంజయ్ కూడా చిరునవ్వుతో మద్దతు తెలిపారు. దీంతో తండ్రి, కొడుకుల మధ్య విబేధాలపై వస్తున్న ప్రచారానికి ఈ వేడుకలోని సంజయ్ స్పందన కొంత స్పష్టత ఇచ్చినట్టయింది.

ఇక ‘సిగ్మా’ హీస్ట్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్, రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement