లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కీలక సమావేశం జరిగింది. జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, సుమలత దేవితో పాటు ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు జాయింట్ కమిషనర్ ఎదుట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
తమకు అన్యాయం జరిగిందని..
సుమలత అధ్యక్షురాలిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఆమె కార్యవర్గంలోని కొంతమంది రాజీనామా చేశారని జాయింట్ కమిషనర్ తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు సుమలత ఉప ఎన్నికలు నిర్వహించడంతో.. ఇప్పటికే ఎన్నికైన తమకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపించినట్లు చెప్పారు. తమవైపే మెజారిటీ సభ్యులు ఉన్నారని రఘు మాస్టర్ పేర్కొన్నారు.
ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని..
ఈ వివాదాన్ని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ సమక్షంలో పరిష్కరించుకోవాలని జాయింట్ కమిషనర్ సూచించారు. వివాదం కొనసాగితే యూనియన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని డాన్సర్లు కోరుతున్నారని రఘు మాస్టర్ తెలిపారు. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.


