జానీ మాస్టర్ సతీమణి సుమలతపై డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌కు, ఫెడరేషన్‌కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. తనపై సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు.
తన ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా తన మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై అభియోగాలు మోపి, నిందలు వేసి వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దల మాటకు గౌరవంతో మౌనం
ఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలు వద్దని పెద్దలు సూచించారని శేఖర్ మాస్టర్ తెలిపారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు.
యూనియన్ సభ్యుల కోసం ముందుంటా
‘యూనియన్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటా. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో ఎన్నో సాంగ్స్‌ను కూడా వదులుకున్నాను’ అని శేఖర్ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై ఫిర్యాదు


