విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీరుతెన్నులపై వైఎస్‌ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దోచుకునేందుకే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. కూటమి ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవని పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారని, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదు అని చెప్పారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలు ప్రజలకు తెలుసని, రాష్ట్రంలో అద్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయని బొత్స పేర్కొన్నారు.
ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఉండాలని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని బొత్స అన్నారు. వైఎస్ఆర్సిపి మేయర్‌ను దౌర్జన్యం చేసి దించేశారని ఆరోపించారు. విశాఖ నగరంలో తాగు నీటి సమస్య ఉందని వాపోయారు. ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని, దోచుకోవడానికే కూటమి ప్రజా ప్రతినిధులు ఉన్నారని బొత్స మండిపడ్డారు. నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని, సీఎం చంద్రబాబు ఒక రోజైనా విశాఖ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు టీవీ 5, ఏబీఎన్ కంటికి కనిపించలేదా? అని నిలదీశారు. పోలవరం నీళ్లు ఎక్కడ ఇచ్చారని, ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇచ్చి గోదావరి జలాలు అని మోసం చేస్తారా? అని బొత్స ప్రశ్నించారు. గోదావరి జలాలు ఇస్తే విశాఖ నగరంలో మంచి నీటి సమస్య ఎందుకు ఉందని అడిగారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల పైకి వస్తున్నారని, పేకాట ఆడేవారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని బొత్సొ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొత్స.. వెన్నుపోటు పార్టీ- వెన్నుపోటు పాలన పోస్టర్ విడుదల చేశారు. పార్టీ నాయకులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడని తానేమీ చెప్పలేదని, ఆయన మామ ఎన్టీఆర్ చెప్పారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, డీఎస్సీలో ఉద్యోగాలు లక్షల రూపాయలకు అమ్ముకున్నారన్నారు. మూడు లక్షల మందితో ఆటలాడుకున్నారని, డీఎస్సీపై మాట్లాడితే అరెస్టు చేస్తారా?.. ఎవర్ని అరెస్టు చేస్తారో చేయండంటూ బొత్స సవాల్ విసిరారు. టెట్ క్వాలిఫై అవకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని, డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు.
అలాగే, చిన్న శీను పార్టీ మార్పుపై స్పం బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుంది. కానీ, రాజకీయ పార్టీ శాశ్వతం. మనుషులు వస్తుంటారు పోతుంటారు.. పార్టీ పని పార్టీ చేస్తుంది. మాకు ఇదేమీ కొత్త కాదు అంటూ వ్యాఖ్యానించారు.


