సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
వైఎస్ జగన్‌కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు.
ప్రజా సమస్యలపై నేరుగా..
పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్‌సీపీ పేర్కొంది.
2019లో అధికారంలోకి..
ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.


