బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ | BRS MLAs Suspension From Assembly News | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

Sep 9 2026 10:45 AM | Updated on Sep 9 2026 11:20 AM

BRS MLAs Suspension From Assembly News

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని సస్పెండ్‌ చేశారు. ఈ సెషన్‌ మొత్తానికి ఈ సస్పెన్షన్‌ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.

బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్‌ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.

ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్‌.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పీకర్‌ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్‌ అయిన వాళ్లలో.. కేటీఆర్‌, హరీష్‌రావు, కౌశిక్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్‌ జాదవ్‌, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్‌, సంజయ్‌ కుమార్‌, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్‌, ప్రశాంత్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్‌ ఛాంబర్‌ వద్ద మార్షల్స్‌ కేటీఆర్‌, హరీశ్‌రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మండలి నుంచి వాకౌట్‌
ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్‌పై ఓటింగ్‌ నిర్వహించాలని చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

..మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్‌ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్‌ చేశారు. అయినా చైర్మన్‌ అంగీకరించకపోవడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఇది ఫామ్‌హౌజ్‌లో జరిగిన కుట్రే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement