ఫామ్‌హౌస్‌లో జరిగిన కుట్రే | Bhatti Vikramarka Slams BRS Over Speaker Gaddam Prasad Kumar Remarks | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌లో జరిగిన కుట్రే

Sep 9 2026 3:18 AM | Updated on Sep 9 2026 3:18 AM

Bhatti Vikramarka Slams BRS Over Speaker Gaddam Prasad Kumar Remarks

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్‌ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‎సభలో రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే..ఒక రోజు ముందు 6వ తేదీన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం పెట్టి కుట్రకు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని నూరిపోసి పంపించిన తరహాలో బీఆర్‌ఎస్‌ సభ్యులను ప్రేరేపించి పంపించారని విమర్శించారు. కుట్రదారుల డైరెక్షన్‌లో కొందరు బీఆర్‌ఎస్‌ సభ్యులు పాత్రధారులుగా సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్‌ఎస్‌ అత్యున్నత నాయకత్వమేనని విమర్శించారు. స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క అన్నారు.

రూపుమాపని మానసిక అస్పృశ్యత: దామోదర 
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మానసిక అస్పృశ్యత రూపుమాపలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఆత్మగౌరవ చరిత్ర. ఆత్మగౌరవమే మా అలంకారం. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’అని మంత్రి అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్‌గా ఉన్నత స్థానానికి చేరుకున్న గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అవమానించడం బాధాకరమన్నారు.

ఇవీ చదవండి: తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement