అసలు హరీశ్‌రావుకు మైక్‌ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా | Gaddam Prasad Kumar Comments On Harish Rao | Sakshi
Sakshi News home page

అసలు హరీశ్‌రావుకు మైక్‌ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా

Sep 9 2026 2:42 AM | Updated on Sep 9 2026 2:42 AM

Gaddam Prasad Kumar Comments On Harish Rao

క్షమాపణ చెబుతారనుకున్నా.. కానీ పక్కదోవ పట్టించాలని చూశారు 

మొదటిసారి నాకు కోపం వచ్చింది... బాగా మనస్తాపం చెందా 

అందుకే సభలో కూర్చోవాలనిపించలేదు.. ఈ ఘటనపై కేసీఆర్‌ నాతో మాట్లాడలేదు 

నాపై మాట్లాడిన మాటలతో దళిత సంఘాలు కోపంగా ఉన్నాయి 

కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్‌లు కొట్లాడింది.. మధు తిట్టింది స్పష్టంగా కనపడుతోంది 

మేమేమీ కొత్త నిబంధనలు తేవడం లేదు.. కేసీఆర్‌ పెట్టిన రూల్సే అమలు చేస్తున్నాం 

అదానీ పేరున్న టీషర్ట్‌ రాహుల్‌ వేసుకెళ్లలేదు.. ప్లకార్డు తీసుకెళ్తే స్పీకర్‌ ఒప్పుకోలేదు 

తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడిన శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌కు చెందిన హరీశ్‌రావుకు మైక్‌ ఇవ్వకూడదని, కానీ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తుంది కాబట్టి మైక్‌ ఇచ్చానని చెప్పారు. అయితే, సోమవారం అసెంబ్లీ గేటు బయట జరిగింది అనుకోకుండా అయితే, హరీశ్‌రావు సభలో మాట్లాడింది మాత్రం తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. జరిగిన దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో క్షమాపణలు చెబుతారేమో అనుకున్నానని, కానీ హరీశ్‌రావు అందుకు విరుద్ధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అందుకే మొదటిసారి కోపానికి వచ్చానని, మనస్తాపం చెందానని, సభలో కూర్చోవాలని అనిపించలేదని, మంగళవారం ఒక్కరోజు ప్యానెల్‌ స్పీకర్‌తో సభను నడిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పదేళ్లు మంత్రిగా హరీశ్‌రావు ఉన్నాడని, ఆయన కూడా ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. తననుద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా ఊగిపోతోందని, దళిత సంఘాలు కోపంగా ఉన్నాయని చెప్పారు. తాతా మధు మాట్లాడిన ప్రదేశం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని, ఆ విషయం బీఆర్‌ఎస్‌ వారికి తెలియదనుకుంటా అని వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్‌లాగా చేయాలనుకుంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను చేసినట్టు తాతా మధు, కౌశిక్‌రెడ్డిలను కూడా సభ నుంచి బయటకు పంపించేవారమన్నారు.  

అక్కడ కనపడుతోంది 
అసెంబ్లీ గేటు బయట బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ గేటు బయట కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్‌రెడ్డిలు పోలీసులు కొట్లాడింది, తాతా మధు మాట్లాడింది ప్రత్యక్షంగా కనపడుతోందని చెప్పారు. కానీ, మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదని, అందుకే విచారణ చేయమని చెప్పానన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు పైనుంచి కింది వరకు నల్ల దుస్తులు వేసుకొని వచ్చినా అభ్యంతరం లేదని, కానీ ఆ దుస్తులపై ఉన్న రాతలు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే, 2014కు ముందు కాంగ్రెస్‌ హయాంలో ఉన్న నిబంధనలను తొలగించి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్‌ కొత్తగా అసెంబ్లీ రూల్స్‌ తెచ్చాడని, ఆ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, ఆ నిబంధనల ప్రకారమే చెబుతున్నామన్నారు. రాహుల్‌గాంధీ నల్లటీషర్టుపై ఆదానీ అని రాసుకొని వెళ్లలేదని, కేవలం నల్ల టీషర్టు వేసుకొని మాత్రమే పార్లమెంటులోకి వెళ్లారని చెప్పారు.  

ప్రభుత్వమే అడిగింది 
తాజా పరిణామాలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని సభలో ప్రభుత్వమే డిమాండ్‌ చేసిందని స్పీకర్‌ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు కేసీఆర్‌ ఫోన్‌ చేయలేదన్నారు. సభ ప్రారంభానికి ముందు తానే కేసీఆర్‌కు ఫోన్‌ చేశానని, సభకు రావాలని అడిగానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్‌ తనతో చెప్పారన్నారు. తాను ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలకు ఫోన్‌ చేసి సభకు రావాలని కోరుతానని వెల్లడించారు. తాతా మధు, నవీన్‌రెడ్డిలు అసెంబ్లీలో సభ్యులు కానప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి చైర్మన్‌కు పంపుతామని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement