తాతా మధు, నవీన్‌రెడ్డి సస్పెన్షన్‌ | Thata Madhu and Naveen Reddy suspended | Sakshi
Sakshi News home page

తాతా మధు, నవీన్‌రెడ్డి సస్పెన్షన్‌

Sep 9 2026 2:20 AM | Updated on Sep 9 2026 2:20 AM

Thata Madhu and Naveen Reddy suspended

తాతా మధు, నవీన్‌రెడ్డి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న అసెంబ్లీ మార్షల్స్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండలిలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి డి.శ్రీధర్‌బాబు

సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటన 

అంతకుముందు శాసనసభలోనూ సస్పెన్షన్‌ తీర్మానం..

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్‌కుమార్‌ రెడ్డిలను సస్పెండ్‌ చేయాలన్న సభ్యుల డిమాండ్‌ను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ఇద్దర్నీ సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఉదయం విరామం తర్వాత సాయంత్రం 6 గంటలకు శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సభ్యులు మండలికి వచ్చారని, చట్టసభలో కీలక వ్యక్తిని ఉద్దేశించి వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండానే మండలి నిబంధనల మేరకు తాతా మధు, నవీన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. 

ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉదయం ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌కు మండలి చైర్మన్‌ను కోరుతూ శాసనసభలో తీర్మానం చేసే వరకు మండలి సమావేశాన్ని వాయిదా వేశారు. అసెంబ్లీ నుంచి ఆ మేరకు తీర్మానం అందిన తర్వాత మండలి తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే వారి సస్పెన్షన్‌ ప్రకటన చేసిన చైర్మన్‌ సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కాగా తాతా మధుసూదన్, నవీన్‌కుమార్‌ రెడ్డిపై సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణ నిబంధనలకు అనుగుణంగా మండలి చైర్మన్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ తీర్మానించింది. సోమవారం శాసన సభాపతిని ఉద్దేశించి వారు అత్యంత అవమానకరంగా, కించపరిచేలా దూషించారంటూ ఆ వ్యాఖ్యలను సభ తీవ్రంగా ఖండించింది.  

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి 
‘ఇటువంటి ప్రవర్తన శాసనమండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదు. శాసన సభాపతి గౌరవం, అధికారం రాజ్యాంగబద్ధ హోదాకు ఇది తీవ్ర భంగం కలిగించింది. రాష్ట్ర శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా దీనిని సభ పరిగణిస్తోంది. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్‌ రావు బాధ్యత వహించి, సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు, శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభ తీర్మానిస్తోంది. ఈ తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్‌కు పంపించాలి..’అని శాసనసభ తీర్మానించింది. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ సభ్యులెవరూ సభలో లేరు. భూముల నిషేధిత జాబితా (22ఏ) అంశంపై చర్చకు పట్టుబట్టుతూ బీజేపీ సభ్యులూ అప్పటికే వాకౌట్‌ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement