breaking news
Thatha Madhu
-
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్‌రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్‌రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు. మధును తరలిస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడించేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే పోలీస్ అధికారి మైక్‌ను తోసేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మధు చెప్పారు. తాతా మధును నారాయణగూడ పీఎస్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మధు, నవీన్‌లను ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.ఇటు.. అసెంబ్లీ గేటు వద్ద నిన్నటి పరిణామాల నేపథ్యంలో పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి సహా మరికొందరిపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది.తాతా మధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. కలత చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో కంటతడి పెట్టారు. ఆ సమయంలో ‘‘మధు వ్యాఖ్యలు స్పీకర్‌కే కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..


