సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్‌కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్‌ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు.
ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్‌ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్‌రావుపై స్పీకర్ ఆగ్రహం


