మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్‌’గా ఉంటున్నాయ్‌! | TDPs Double Message to Jana Sena: Appease and Warn | Sakshi
Sakshi News home page

మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్‌’గా ఉంటున్నాయ్‌!

Sep 8 2026 11:47 AM | Updated on Sep 8 2026 11:49 AM

TDPs Double Message to Jana Sena: Appease and Warn

కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్‌ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్‌, ట్రోల్స్‌తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్‌ మేసేజ్‌ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సోషల్‌ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్‌లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. 

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్‌ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్‌ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను టార్గెట్‌ చేసుకుని మీమ్స్‌ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్‌ ఎన్టీఆర్‌ అమెచ్యూరిష్‌ డైలాగ్‌పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్‌ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. 

అయితే దీనిని క్యాష్‌ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్‌లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ సినీ, పొలిటికల్‌ కెరీర్‌ ఫెయిల్యూర్స్‌ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్‌ నటుడు, పవన్‌ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. 

అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్‌ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్‌, ట్రోల్స్‌ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. 

ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. 

మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్‌ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్‌ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.

అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్‌ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్‌ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.

దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: మేయర్‌ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement