కొడుక్కి విజయవాడ మేయర్ సీటు కోసం బొండా ఉమా పాకులాట
అదే పదవిపై కన్నేసి పావులు కదుపుతున్న మరో 10 మంది
రెండు సామాజికవర్గాలకు హాట్ సీట్‌గా విజయవాడ మేయర్ పదవి
విశాఖ మేయర్ పీఠం కోసం ఎమ్మెల్యేల కుస్తీ
కొడుకులకు పదవి ఇప్పించాలని గంటా, రామకృష్ణబాబు యత్నాలు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ మధ్య హోరాహోరీ
లాబీయింగ్.. తిరుపతి, కాకినాడ, చిత్తూరు, మచిలీపట్నం
మేయర్ సీట్లపై రెండు పార్టీల నేతల కన్ను
నోటిఫికేషన్ వెలువడకుండానే నేతల కుమ్ములాట
సాక్షి, అమరావతి: ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న రీతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కూటమి పార్టీల్లో అప్పుడే కుమ్ములాటలు ముదిరిపోయాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు, ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆ పదవుల కోసం విపరీతంగా లాబీయింగ్‌లు, ఎత్తులు పైఎత్తులు, బేరసారాలు మొదలుపెట్టేశారు.
బెజవాడ టీడీపీలో నువ్వా, నేనా?
విజయవాడ మేయర్ పీఠం కోసం టీడీపీలోని రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కాపు వర్గం నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థను అందరి కంటే ముందు రేసులో నిలబెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తన కుమారుడికి మేయర్ సీటు ఇచ్చి కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో మేయర్ పదవిని రెండుసార్లు కమ్మ వర్గానికి ఇచ్చారని, ఈసారి తమకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టడమే కాదు చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లి కూడా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
దీంతో ఉలిక్కిపడిన కమ్మ సామాజికవర్గం నేతలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని రంగంలోకి దించి ఇంకా చాలామంది రేసులో ఉన్నారని చెప్పించారు. ఆయన కొమ్మారెడ్డి పట్టాభి, బొప్పన భవకుమార్ లేకపోతే తన వర్గానికి చెందిన ఎవరికైనా ఆ సీటు ఇప్పించాలని చూస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని అపర్ణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు.
లోకేశ్‌తో సన్నిహితంగా ఉండే ఆమె తనయుడు దేవినేని చందు.. అయితే తన తల్లికి లేకపోతే జెన్‌జెడ్ కోటాలో తన భార్యకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలివిగా పావులు కదుపుతూ తన వర్గం నుంచి ఒక మాజీ కార్పొరేటర్ పేరును తెరపైకి తెచ్చి చివరికి తన భార్య అనూరాధకు మేయర్ సీటు ఇప్పించుకునే యత్నాల్లో ఉన్నారు. మరికొందరూ రేసులో ఉండి చంద్రబాబు, లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
విశాఖ మేయర్ సీటు కోసం ఎమ్మెల్యేల హైరానా
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ మేయర్ సీటు ఎలాగైనా సొంతం చేసుకోవాలని ముగ్గురు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జిలు తెరవెనుక ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ తనయులకు ఆ సీటు ఇప్పించాలని తాపత్రయపడుతుండగా మిగిలిన వాళ్లు తామే నేరుగా సీటు కోసం యత్నిస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు తన తనయుడు రవితేజకి మేయర్ సీటు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌ను అడిగినట్లు సమాచారం. దీని గురించి ఆయనను ఇటీవల మీడియా ప్రశి్నంచగా తనకు ఆ సీటు ఇవ్వరా? అని ఎదురు ప్రశి్నంచడం విశేషం. మేయర్ రేసులో ఆయన చాలా సీరియస్ పోటీదారుగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా ఉన్న లోకేశ్ తోడల్లుడు భరత్ ఇక్కడ కీలకం కావడంతో ఆయన మద్దతు కోసం చూస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ ఎమ్మెల్యేలు కుదిరితే తమ కుమారులు, మహిళా రిజర్వేషన్ అయితే తమ కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. భరత్ మాత్రం తనకు అనుకూలంగా ఉండే వారికి మేయర్ సీటు ఇప్పించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నెల్లూరులో వేమిరెడ్డి చెబితేనే మేయర్
నెల్లూరు మేయర్ సీటు కోసం టీడీపీలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలు మేయర్ సీటును తమ అనుయాయుడు రూప్‌కుమార్ యాదవ్‌కి ఇప్పించాలని చూస్తుండడం మిగిలిన నేతలకు కంటగింపుగా మారింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి.. వేమిరెడ్డిని కాదంటే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందని నోరు మెదపడంలేదు. ఇదిలా ఉంటే మేయర్ ఎంపికలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు. పలువురు కీలక నేతలూ వేమిరెడ్డి తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు.
గోదావరి జిల్లాల్లో జనసేనతో ఫైట్
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు మేయర్ సీట్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర మున్సిపల్ చైర్మన్ సీట్ల కోసం జనసేన, టీడీపీ నేతలు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు. ఇక్కడ తమకు బలం ఎక్కువగా ఉందంటూ జనసేన నేతలు ఎక్కువ మున్సిపాలిటీలు ఇవ్వాలని అడుగుతుండగా టీడీపీ నేతలు అందుకు అంగీకరించడంలేదు. కాకినాడ మేయర్ సీటుపై జనసేన, రాజమండ్రి మేయర్ సీటుపై బీజేపీ కన్నేసి చంద్రబాబు దగ్గర మంతనాలు జరుపుతుండడంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తమకు అవకాశాల్లేకుండా ఇక్కడ కూడా పొత్తు పేరుతో అన్యాయం చేస్తారా అని ముఖ్య నేతలను నిలదీస్తున్నారు.
రాయలసీమలో తిరుపతి కార్పొరేషన్ తమకు ఇవ్వాలని జనసేన కోరుతుండడాన్ని టీడీపీ నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గుంటూరు కార్పొరేషన్ కోసం టీడీపీ ముఖ్య నేతలు ఎత్తులకుపైఎత్తులు వేసుకుంటున్నారు. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం కార్పొరేషన్లు తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేయడం అక్కడి టీడీపీ నేతలకు ఇరకాటంగా మారి బహిరంగంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఉండడం, ఎక్కువ బడ్జెట్, అపరిమితమైన అధికారాలు ఉండడంతో వాటి కోసం నేతలు పోటీపడుతున్నారు. ఒక్కసారి పదవి దక్కితే రెండు చేతులా సంపాదించుకోవచ్చని వాటిపై కన్నేసి తమ కుటుంబంలోని ఎవరో ఒకరికి ఇప్పించుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. లేనిపక్షంలో తమకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలని చూస్తూ రాజకీయాలు చేస్తున్నారు.


